Friday, 12 July 2019

కపిల దేవహూతి సంవాదం - 61


( సాంఖ్య యోగము )

3-950-వ.
ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించు" నని కపిలుం డెఱింగించిన విని దేవహూతి వెండియు నిట్లనియె "మహాత్మా! మహదాది భూతంబులకుం బ్రకృతి పురుషులకుం గల్గిన పరస్పర లక్షణంబులను దత్స్వరూపంబులను నెఱింగించితివి; ఇంక నీ ప్రకారంబున సాంఖ్యంబు నందు నిరూపింపఁబడు నట్టి ప్రకారంబును, భక్తియోగ మహాత్మ్యంబును, బురుషుండు భక్తియోగంబునం జేసి సర్వలోక విరక్తుం డగునట్టి యోగంబును, బ్రాణిలోకంబునకు సంసారం బనేక విధం బయి యుండుఁ; గావున బరాపరుండవై కాలస్వరూపి వైన నీ స్వరూపంబును ఏ నీవలని భయంబునం జేసి జనులు పుణ్యకార్యంబులు సేయుచుండుదురు; మిథ్యాభూతం బైన దేహంబు నందు నాత్మాభిమానంబుసేయుచు మూఢుండై కర్మంబు లందు నాసక్తం బైన బుద్ధిం జేసి విభ్రాంతుం డగుచు సంసార స్వరూపం బగు మహాంధ కారంబు నందుఁ జిరకాల ప్రసుప్తుం డైన జనునిఁ బ్రబోధించుకొఱకు యోగభాస్కరుండవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు నీవు; గావున, నాకు నిన్నియుం దెలియ సవిస్తరంబుగా నానతియ్యవలయు" ననిన దేవహూతికి గపిలుం డిట్లనియె.

భావము:
ఈ ఆత్మ నిజస్వరూపంతో విరాజిల్లుతుంటుంది” అని కపిలుడు తెలియజెప్పగా విని దేవహూతి మళ్ళీ ఇలా అన్నది. “అసత్యమైన దేహంపై ఆత్మాభిమానం పెంచుకొని మూర్ఖుడై, కర్మలపై ఆసక్తి కలిగిన బుద్ధితో భ్రమించి, సంసారమనే పెనుచీకటిలో చాలాకాలం నిద్రామత్తుడైన జనుని మేల్కొల్పడం కోసం యోగభాస్కరుడవై పుట్టిన పుణ్యాత్ముడవు నీవు. కాబట్టి ఓ మహాత్మా! మహదాది భూతాలకు, ప్రకృతి పురుషులకు ఉన్న వేరువేరు లక్షణాలను చెప్పావు. వాటి వాటి స్వరూపాలను వివరించావు. ఆ విధంగానే సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తియోగ మహత్త్వాన్ని వెల్లడించు. పురుషుడు భక్తియోగం ద్వారా సమస్త ప్రపంచంనుండి విరక్తుడయ్యే విధం వివరించు. ప్రాణిలోకానికి అనేక విధాలుగా ఉండే సంసారానికి పరాపరుడవై కాలస్వరూపుడవై ఉన్న నీ స్వరూపాన్ని ఎరిగించు. కాలస్వరూపుడవైన ఏ నీ భయంవల్ల మానవులు పుణ్యకర్మలు చేస్తారో వానిని సవిస్తరంగా తెలిసేలా చెప్పు” అని అడుగగా దేవహూతితో కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=950

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...