Monday, 15 July 2019

కపిల దేవహూతి సంవాదం - 66


(భక్తి యోగం)

3-959-సీ.
"నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు; 
శ్రద్ధాగరిష్ఠతఁ జతుర పాంచ
రాత్రోక్త హరిసమారాధన క్రియలను; 
నిష్కామనంబున నెఱి మదీయ
విగ్రహదర్శన వినుతి పూజా వంద; 
నధ్యానసంశ్రవణములఁ గర్మ
సంగి గాకుండుట సజ్జనప్రకరాభి; 
మానంబు నొందుట హీను లందు
3-959.1-తే.
జాల ననుకంపసేయుట సముల యందు
మైత్రి నెఱపుట యమనియమక్రియాది
యైన యోగంబుచేత నాధ్యాత్మికాధి
భౌతికాదులఁ దెలియుట పలుకుటయును.

భావము:
“స్నాన సంధ్యాది నిత్యకర్మలందు, జగత్కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి ఉండడం, గురువులను పెద్దలను గౌరవించడం, పాంచరాత్రాగమంలో చెప్పబడిన ప్రకారం శ్రీహరిని నిష్కామ బుద్ధితో ఆరాధించడం, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మలలో చిక్కుకోకుండా ఉండడం, గొప్పవారిపైన ఆదర గౌరవాలు, తనకన్న తక్కువ వారిపైన దయాదాక్షిణ్యాలు, తనతో సమానులపైన స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరచుకోవాలి. యోగాభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలను తాను తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉండడం... (చేయాలి).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=959

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...