Monday, 29 July 2019

కపిల దేవహూతి సంవాదం - 74


(భక్తి యోగం)

3-972-వ.
అంత; నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్టుండై యుండు నట్టి భగ వంతుం జూచి భక్తియోగంబుననేని యోగంబుననేనిఁ బురుషుండు పరమాత్మఁ బొందు ప్రకృతిపురుషాత్మకంబును దద్వ్యతిరిక్తంబును నైన దైవంబు నై కర్మవిచేష్టితం బగుచు నుండు; అదియ భగవద్రూపంబు; ఇట్టి భగవద్రూపంబు భేదాస్పదం బగుచు నద్భుత ప్రభావంబు గల కాలం బనియుఁ జెప్పంబడు; అట్టి కాలంబు మహదాదిత త్త్వంబులకును మహత్తత్త్వాభిమాను లగు జీవులకును భయాహం బగుటంజేసి సకల భూతములకు నాశ్రయం బగుచు నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాత గావున వశీకృతభూతుండై ప్రభుత్వంబు భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు; అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేఁడు; అట్టి విష్ణుండు సకలజనంబుల యందావేశించి యప్రమత్తుఁడై ప్రమత్తు లయిన జనంబులకు సంహారకుండై యుండు; అతని వలని భయంబునంజేసి వాయువు వీచు సూర్యుం డుదయించు, నింద్రుండు వర్షించు, నక్షత్ర గణంబు వెలుంగుఁ, జంద్రుండు ప్రకాశించు, దత్తత్కాలంబుల వృక్ష లతాదులోషధుల తోడంగూడి పుష్ప ఫలభరితము లగు, సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు దప్పక యుండు; నగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతోఁ గూడ బరువునఁ గ్రుంగ వెఱచు, ఆకాశంబు సకల జనంబులకు నవకాశం బిచ్చు, మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సప్తావరణావృతం బగు లోకం బను స్వదేహంబు విస్తరింపఁ జేయు; గుణాభిమాను లగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబు నందు నియోగింపఁబడి ప్రతిదినంబు నయ్యయి సర్గంబుసేయ నప్రమత్తులై యుండుదురు; పిత్రాదులు పుత్రోత్పత్తిఁ జేయుదురు; కాలుండు మృత్యుసహాయుండై మారకుండై యుండు" అని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె.

భావము:
అప్పుడు దేవుడు జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడు. అటువంటి జీవునిలో ఉన్న దేవుని యోగమార్గంతో కాని, భక్తిమార్గంతో కాని పురుషుడు పొందగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే ప్రకృతినుండి వేరై కర్మలు చేయనివాడై కూడా ఉంటాడు. ఇదే భగవంతుని రూపం. ఇది జీవులందుగల పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తిమంతమై ఉంటుంది. అదే కాలం అనబడుతుంది. అటువంటి కాలం మహదాది తత్త్వాలకు, మహత్తత్త్వాభిమానులకు భీతి గొల్పుతుంది. అందుకనే అది అన్ని జీవులకు ఆశ్రయమై, ఆ జీవులలో ఉంటూ ఒక ప్రాణిచేత మరొక ప్రాణిని గ్రసింపజేస్తుంది. భగవంతుడైన విష్ణువు యజ్ఞఫల ప్రదాతయై, ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని, వాటిని పాలించే మహారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు బంధువు అంటూ ఎవరూ లేరు. అటువంటి విష్ణువు అందరిలోను ఆవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణచివేస్తుంటాడు. ఆ పరమాత్ముని గురించిన భయం వల్లనే గాలి వీస్తుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వాన కురిపిస్తాడు. నక్షత్రాలు వెలుగుతాయి. చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతాడు. ఆయా కాలాలలో చెట్లూ, తీగలూ మొదలైనవి ఓషధులతో కూడి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. నదులు ప్రవహిస్తాయి. సముద్రాలు హద్దు మీరకుండా ఉంటాయి. అగ్ని మండుతుంది. భూమి కొండల బరువుకు క్రుంగకుండా ఉంటుంది. ఆకాశం అందరికీ చోటిస్తుంది. మహత్తత్త్వమే ఈ లోకానికి మూలభూతమైనది. ఏడు ఆవరణాలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింపచేస్తుంది. బ్రహ్మ మొదలైనవాళ్ళు సర్వేశ్వరుని ద్వారా ఈలోకసృష్టి నిమిత్తం నియమింపబడినవారై ప్రతిదినం ఆయా సృష్టికార్యక్రమాలలో జాగరూకులై ఉంటారు. తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సాయంతో జీవులను చంపుతూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా భగవంతుని కట్టడిలో ఉంటుంది” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=972

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...