(భక్తి యోగం)
3-981-సీ.
బలిమి సాలక మందభాగ్యుఁడై కుమతి యై;
పూని యపుడు క్రియాహీనుఁ డగుచు
దవిలి వృథాప్రయత్నంబులు సేయుచు;
మూఢుఁడై కార్పణ్యమునఁ జరించు
నట్టి యకించనుఁ డగువానిఁ జూచి త;
ద్దారసుతాదు లాత్మలను వీఁడు
గడు నశక్తుఁడు ప్రోవఁగాఁజాలఁ డితఁ డని;
సెగ్గింతు రర్థిఁ గృషీవలుండు
3-981.1-తే.
బడుగు ముసలెద్దు రోసిన పగిది నంత
నతఁడు నేవెంటలను సుఖం బందలేక
తాను బోషించు జనులు దన్ తనరఁ బ్రోవ
బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపఱుప.
భావము:
శక్తి చాలక, అదృష్టం సన్నగిల్లి, కుటిల బుద్ధితో ఏ విధమైన పనులూ చేయలేని సోమరిపోతై పనికిరాని ప్రయత్నాలు చేస్తూ, పరమ మూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. రైతు బక్కచిక్కిన ముసలి ఎద్దును అసహ్యించుకొన్నట్లు ఆ దరిద్రుణ్ణి చూచి అతని ఆలుబిడ్డలు ‘ఇతడు అశక్తుడు, ఈ పనికిమాలినవాడు మనలను పోషింపలేడు’ అని ఏవగించుకొంటారు. ఈవిధంగా అతడు ఎక్కడా ఏ విధంగానూ సుఖంలేక ఇన్నాళ్ళూ తాను ఎవరినైతే తిండిపెట్టి పోషించాడో వారు పెట్టే తిండి తింటూ, ముసలితనంతో మూలుగుతూ బాధగా బరువుగా బ్రతుకును ఈడుస్తూ (ఉంటాడు).
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=981
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment