Wednesday, 14 August 2019

కపిల దేవహూతి సంవాదం - 87


(గర్భ సంభవ ప్రకారంబు)

3-992-వ.
మఱియు; మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగచ్ఛిద్రంబులు గలిగి నాలవ మాసంబున సప్తధాతువులును బంచమ మాసంబున క్షుత్తృష్ణలును గలిగి షష్ట మాసంబున మావిచేతం బొదువం బడి తల్లి కుక్షిని దక్షిణభాగంబునం దిరుగుచు మాతృభుక్తాన్న పానంబులవలనఁ దృప్తి బొందుచు నేధమానధాతువులు గల్గి జంతు సంకీర్ణంబగు విణ్మూత్రగర్తం బందుఁ దిరుగుచుఁ క్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచుఁ దల్లి భక్షించిన కటుతిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబు లైన రసంబులచేత బరితప్తాంగుం డగుచు జరాయువునఁ గప్పంబడి బహిప్రదేశంబు నందు నాత్రంబులచేత బద్ధుండై కుక్షి యందు శిరంబు మోపికొని భుగ్నం బైన పృష్టగ్రీవోదరుండై స్వాంగ చలనంబు నందు నసమర్దుం డగుచుఁ బంజరంబందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వజన్మ దుష్కృతంబుల దలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించు; అంత నేడవ నెల యందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమి సోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత నతి వేపితుం డగుచు యోచమానుండు దేహాత్మదర్శియుఁ బునర్గర్భ వాసంబునకు భీతుండు నగుచు బంధనభూతం బగు సప్తధాతువులచే బద్ధుం డై కృతాంజలి పుటుండు దీనవదనుండు నై జీవుండు దా నెవ్వనిచే నుదరంబున వసియింపఁబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు.

భావము:
మూడు నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడుతాయి. నాలుగవ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. ఐదవనెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. ఆరవ నెలలో మావిచేత కప్పబడి, తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతుంటాడు. వాత పిత్త శ్లేశ్మలానే ధాతువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మల మూత్రాల గుంటలలో పొర్లుతూ, అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెట్టగా మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రరసాలు అవయవాలను తపింపచేస్తాయి. మావిచే కప్పబడి, బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లిపొట్టలో తలదూర్చి, వంగి, ముడుచుకొని, పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదలించటానికి శక్తిలేక పంజరంలో చిక్కిన పక్షివలె బంధితుడై ఉంటాడు. దైవదత్తమైన తెలివితో వెనుకటి జన్మలలోని పాపాలను తలచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తుకూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. ఏడవనెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలంలోని క్రిములతో కలసి మెలసి ఒకచోట ఉండలేక కడుపులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి, విమోచనాన్ని యాచిస్తూ, మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధనరూపాలైన సప్తధాతువులతో బంధితుడై, చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=992

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...