Friday, 16 August 2019

కపిల దేవహూతి సంవాదం - 90


( గర్భ సంభవ ప్రకారంబు )

3-996-సీ.
అనవుడు సుతునకు జనని యిట్లనుఁ "దగ; 
మహితాత్మ! యెవ్వని మహిమచేత
ఘనమోహులై గుణకర్మనిమిత్త సాం; 
సారికమార్గ సంచారములను
ధృతిసెడి యలసి యేదిక్కు నెఱుంగక; 
హరిపాద ధ్యానంబు నాత్మ మఱచి
యుండు వారలకు నే యుక్తియు నమ్మహా; 
పురుషు ననుగ్రహబుద్ధి లేక
3-996.1-తే.
తద్గుణధ్యాన తన్మూర్తి దర్శనములు
గోచరించుట యెట్లు నాకునుఁ బ్రబోధ
కలితముగఁ బల్కు" మనవుడుఁ గపిలుఁ డనియె
నంబతోడను సుగుణకదంబతోడ.

భావము:
అని చెప్పిన కొడుకుతో తల్లి ఇలా అన్నది “ఓ మహానుభావా! ఎవని మాయవల్ల మానవులు వ్యామోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక, అలసిపోయి దిక్కు తెలియక చీకాకు పడుతూ చివరకు ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనస్సులో మరచిపోతారో, ఆ పురుషోత్తముని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలనీ, ఆయన రూపాన్ని దర్శించాలనీ బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలా విప్పి చెప్పు” అని అడిగిన సద్గుణవల్లియైన తల్లితో కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=996

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...