Saturday, 24 August 2019

కపిల దేవహూతి సంవాదం - 96


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1006-సీ.
జనయిత్రి! సత్యంబు శౌచంబు దయయును; 
ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు 
క్షమయును యశమును శమమును దమమును; 
మొదలుగాగల గుణంబులు నశించు
జనుల కసత్సంగమున నని యెఱిఁగించి; 
వెండియు నిట్లను వినుము, మూఢ
హృదయులు శాంతి విహీనులు దేహాత్మ; 
బుద్ధులు నంగనా మోహపాశ
3-1006.1-తే.
బద్ధ కేళీమృగంబుల పగిదిఁ దగిలి
పరవశస్వాంతముల శోచ్యభావు లైన
వారి సంగతి విడువంగ వలయు నందు
నంగనాసంగమము దోష మండ్రు గాన.

భావము:
అమ్మా! దుర్మార్గుల సాంగత్యంవల్ల సత్యం, శుచిత్వం, దయ, ధ్యైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి” అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. “మూఢ హృదయులు, శాంతి లేనివాళ్ళు, దేహమే ఆత్మ అని భావించేవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మృగాలలాగా పరులకు వశమైన బుద్ధి కలవారు శోచనీయులు. అటువంటివారి సాంగత్యం వదలిపెట్టాలి. అందులోను స్త్రీసాంగత్యం బలీయమైన దోషం అని ప్రాజ్ఞులంటారు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1006

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...