Sunday, 8 September 2019

కపిల దేవహూతి సంవాదం - 109


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1025-వ.
అనిచెప్పి; వెండియు నిట్లనియె "భగవంతుం డగు వాసుదేవుని యందు బ్రయుక్తం బగు భక్తియోగంబు బ్రహ్మసాక్షాత్కార సాధనంబు లగు వైరాగ్య జ్ఞానంబులం జేయు; అట్టి భగవద్భక్తి యుక్తం బైన చిత్తం బింద్రియవృత్తులచే సమంబు లగు నర్థంబు లందు వైషమ్యంబును బ్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచేఁ జూచుచుండు జ్ఞానపురుషుండును బరబ్రహ్మంబును బరమాత్ముండును నీశ్వరుండును నగు పరమపురుషుం డేకరూపంబు గలిగి యుండియు దృశ్యద్రష్టృ కరణంబులచేతం బృథగ్భావంబు బొందుచుండు; ఇదియ యోగికి సమగ్రం బగు యోగంబునం జేసి ప్రాప్యంబగు ఫలంబు; కావున విషయ విముఖంబు లగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును హేయగుణ రహితంబును నగు బ్రహ్మంబు మనోవిభ్రాంతిం జేసి శబ్దాది ధర్మం బగు నర్థరూపంబునం దోఁచు; అది యెట్టు లర్థాకారంబునం దోఁచు నని యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును భూతరూపంబునం బంచవిధంబును నింద్రియరూపంబున నేకాదశవిధంబును నై యుండు; జీవరూపుం డగు విరాట్పురుషుండు జీవవిగ్రహం బైన యండం బగు జగంబునం దోఁచుచుండు; దీని శ్రద్ధాయుక్తం బయిన భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి సమాహితమనస్కుం డై నిస్సంగత్వంబున విరక్తుం డైనవాడు పొడగనుచుండు; అది యంతయు బుధజనపూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి; సర్వ యోగ సంప్రాప్యుం డగు నిర్గుణుండు భగవంతుం డని చెప్పిన జ్ఞానయోగంబును మదీయభక్తి యోగంబును నను రెండు నొకటియ యింద్రియంబులు భిన్నరూపంబులు గావున నేకరూపం బయిన యర్థం బనేక విధంబు లగు నట్లేకం బగు బ్రహ్మం బనేక విధంబులుగఁ దోఁచు; మఱియును.

భావము:
అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. “పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తియోగం బ్రహ్మసాక్షాత్కారానికి సాధనాలైన జ్ఞానాన్నీ వైరాగ్యాన్నీ కలుగజేస్తుంది. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాలలో సమంగా వర్తిస్తుంది. అటువంటి మనస్సు కలవానికి హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, విషయ లాలస, గ్రహింప దగినవీ, తిరస్కరింప దగినవీ ఉండవు. సర్వత్ర సమదర్శన మేర్పడుతుంది. తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడై ఉండికూడా కనబడే రూపాన్ని బట్టీ, చూచేవారినిబట్టీ, చూడటానికి ఉపయోగపడే సాధనాలనుబట్టీ వేరువేరు రూపాలలో గోచరిస్తాడు. ఇదే యోగి అయినవాడు సంపూర్ణ యోగంవల్ల పొందదగిన ఫలం. కావున విషయాలనుండి వెనుకకు మరలిన ఇంద్రియాలవల్ల జ్ఞాన స్వరూపమూ, హేయగుణ రహితమూ అయిన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్దం స్పర్శం మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది. ఆ పరబ్రహ్మం అర్థస్వరూపంతో ఎట్లా కనిపిస్తుందని నీకు సందేహం కలుగవచ్చు. అహంకారం గుణరూపం ధరించి సత్త్వరజస్తమస్సులై మూడు విధాలుగానూ, భూతరూపం ధరించి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలనే అయిదు విధాలుగానూ, ఇంద్రియరూపం ధరించి పదకొండు విధాలుగానూ ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానావిధాలుగా భాసిస్తుంది. విరాట్పురుషుడు జీవస్వరూపుడు. జీవరూపమైన ఈ జగత్తు అనే గ్రుడ్డులో అతడు నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోనూ, యోగాభ్యాసంతోనూ, నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడు దర్శిస్తాడు. అమ్మా! నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవు. కాబట్టి నీకు ఈ విషయమంతా వెల్లడించాను. సమస్త యోగసాధనలవల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయోగులు పలుకుతున్నారు. నేను చెప్పిన భక్తియోగం ఆ పరమాత్మను సగుణుడుగా పేర్కొంటున్నది. వాస్తవానికి జ్ఞానయోగం భక్తియోగం రెండూ ఒక్కటే. ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్లు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1025

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...