Wednesday, 18 September 2019

కపిల దేవహూతి సంవాదం - 117


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

1039-వ.
అదిగావునఁ; బరబ్రహ్మంబవును, బరమపురుషుండవును, బ్రత్యఙ్మనో విభావ్యుండవును, సమస్తజన పాపనివారక స్వయంప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీమహావిష్ణుడవును నగు నీకు వందనంబు లాచరించెదను" అని స్తుతించినం బరమపురుషుండును, మాతృ వత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద్రహృదయకమలుం డై జనని కిట్లనియె.
3-1040-తే.
"తవిలి సుఖరూపమును మోక్షదాయకంబు
నైన యీ యోగమార్గమే నంబ! నీకు
నెఱుఁగ వివరించి చెప్పితి నిది దృఢంబు
గాఁగ భక్తి ననుష్ఠింపు కమలనయన!

భావము:
అందువల్ల పరబ్రహ్మవూ, పరమపురుషుడవూ, వెలుపలా లోపలా సంభావింప తగినవాడవూ, సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవూ, స్వయంప్రకాశుడవూ, వేదమూర్తివీ, మహావిష్ణు స్వరూపుడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను.” అని దేవహూతి స్తుతించగా పురుషోత్తముడూ, మాతృప్రేమతో నిండినవాడూ అయిన కపిలుడు కరుణరసార్ద్రహృదయుడై తల్లితో ఇలా అన్నాడు. “కమలదళాల వంటి కన్నులు గల తల్లీ! సుఖస్వరూపమూ, మోక్షప్రదమూ అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1040

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...