తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 13
( కలియుగ ధర్మంబు )
12-20-వ.
అనిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె; “కలియుగం బతిపాప సమ్మిళితంబు; గాన దురితంబు లేలాగున రాకుండఁ జేయుదురు? కాలం బే క్రమంబున నడచుఁ? గాలస్వరూపకుం డైన హరి ప్రభావం బేలాగునం గానఁబడు? నీ జగజ్జాలం బెవ్విధంబున నిలుచు?” నని యడిగిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియెఁ;“ గృత త్రేతా ద్వాపర కలి యుగంబులను యుగ చతుష్టయంబును గ్రమంబుగాఁ బ్రవర్తించు, ధర్మంబునకు సత్య దయా తపో దానంబులు నాలుగు పాదంబులై నడచు; శాంతిదాంత్యత్మజ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి యుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణం బై ప్రవర్తిల్లు; శాంతిదాంతికర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూఁడు పాదంబుల రెండవ యుగంబునం బ్రవర్తిల్లు; విప్రార్చనాహింసావ్రత జపానుష్టానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల మూడవ యుగంబునం దేజరిల్లు; మఱియు జనులు గలియుగంబున దర్మరహితులు, నన్యాయకారులు, క్రోధమాత్సర్యలోభమోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచారరహితులు, దురాచారులు, దురన్నభక్షకులు, శూద్రసేవారతులు, నిర్దయులు, నిష్కారణవైరులు, దయాసత్యశౌచాది విహీనులు, ననృతవాదులు, మాయోపాయులు, ధనవిహీనులు, దోషైక దృక్కులునై పాపచరితులగు రాజుల సేవించి, జననీజనక సుత సోదర బంధు దాయాద సుహృజ్జనులం బరిత్యజించి, సురతాపేక్షులై కులంబులం జెఱచుచుండెదరు; మఱియు క్షామ డామరంబులం బ్రజా క్షయం బగు; బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహవిహారులై యజ్ఞాదికర్మంబులు పదార్థపరులై చేయుచు హీనులై నశించెద; రట్లుగాన యీ కలియుగంబున నొక్క ముహూర్తమాత్రం బయిన నారాయణస్మరణ పరాయణులై మనంబున ‘శ్రీనృసింహ వాసుదేవ సంకర్ష’ణాది నామంబుల నచంచల భక్తిం దలంచు వారలకుఁ గ్రతుశత ఫలంబు గలుగు; నట్లు గావున రాజ శేఖరా! నీ మది ననవరతంబు హరిం దలంపుము; కలి యనేక దురితా లయంబు గాన, యొక్క నిమేషమాత్రంబు ధ్యానంబు సేసినం బరమ పావనత్వంబు నొంది కృతార్థుండ వగుదు” వని పలికి మఱియును.
భావము:
అని శుకయోగి పరీక్షిన్మహారాజునకు చెప్పాడు. అప్పుడు పరీక్షన్మహారాజు శుకమహర్షిని ఇలా అడిగాడు. “కలియుగం ఘోరపాపాలకు ఆలవాలం కదా. మరి ఈ కాలంలో ప్రజలు తమకు పాపాలు చెందకుండ ఏమి చేయాలి? కాలం ఏవిధంగా నడుస్తుంది? కాలస్వరూపుడు విష్ణుదేవుని ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది? ఈ లోకాలన్నీ ఏవిధంగా నిలబడతాయి?” అంతట, శుకమునీంద్రుడు మహారాజుకు ఈవిధంగా బదులు చెప్పాడు. “కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు నాలుగు. ఆ నాలుగు యుగాలు వరుసగా నడుస్తుంటాయి. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అని నాలుగు పాదాలు. ప్రథమ యుగం కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానము, వర్ణాచారాలు, ఆశ్రమాచారాలు మున్నగునవి కలిగి ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. రెండవ యుగం త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణ మున్నగు లక్షణాలు కలిగి ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది. మూడవ యుగం ద్వాపరయుగంలో బ్రాహ్మణపూజ, జపానుష్టానములు, అహింసావ్రతము మున్నగు లక్షణాలు కలిగి ధర్మం రెండు పాదాలతో ప్రకాశిస్తుంది. ఇంక నాలుగవ యుగం కలియుగంలో జనులు ధర్మదూరులు, అన్యాయం ఆచరించే వారు, క్రోధం మాత్సర్యం మోహం లోభం మున్నగు దుర్లక్షణాలు కలవారు, అయి ఉంటారు. వర్ణాచారాలను ఆశ్రమాచారాలను విడిచిన వారు, దురాచార పరులు, తినరాని ఆహారం తినువారు, శూద్రసేవాసక్తులు, దయలేనివారు, నిష్కారణ వైరాలు పెట్టుకునేవారు, అబద్ధాలకోరులు, కపటోపాయాలుపన్నువారు, దయ సత్యము శౌచము మున్నగు సుగుణాలు లేనివారు, దరిద్రులు, దోషపూరిత చూపులు కలవారు అయి ఉంటారు. అంతేకాకుండా పాపశీలం కల రాజులను సేవిస్తూ ఉంటారు. తల్లి తండ్రి కొడుకు సోదరుడు చుట్టం జ్ఞాతి స్నేహితుడు అన్న అనురాగాలు లేకుండా ఉంటారు. కేవలం కాముక కర్మ యందే కాంక్ష కలిగి తిరుగుతూ ఉంటారు. కులపవిత్రతను కూలదోస్తూ ఉంటారు. ఇంకా ఆ కలికాలంలో కరువుకాటకాలవలన ప్రజలు నశించిపోతుంటారు. బ్రాహ్మణులు పరిగ్రహింపరాని దానాలు పరిగ్రహిస్తూ ఉంటారు. భౌతిక పదార్థాల మీద మాత్రమే ఆసక్తితో యజ్ఞయాగాదులు చేస్తూంటారు. యధేచ్ఛావిహారులై ఉంటారు. ఇలా భ్రష్టులు నీచులు కావటంచేత నశిస్తారు. కాబట్టి ఈ కలియుగంలో ఒక్కక్షణమైనా సరే శ్రీహరి స్మరణ పరాయణులు అయి, శ్రీనృసింహ, వాసుదేవ, సంకర్షణ మొదలైన నామాలతో సుస్థిరమైన భక్తితో పలకాలి. ఆ విధంగా హరినామస్మరణ పరాయణులు అయిన వారికి స్మరణమాత్రాన వందయజ్ఞాలు చేస్తే వచ్చే అంత ఫలం వస్తుంది.కాబట్టి రాజోత్తమా! నీ మనస్సులో నిరంతరాయంగా హరిని స్మరించు. కలియుగం అనేక పాపాలకు పుట్టిల్లు. కావున, ఒక్క నిమిషం ధ్యానం చేసినా ఉత్తమమైన పవిత్రత పొంది కృతార్ధుడవు అవుతావు.” అని చెప్పి శుకమహర్షి మరల ఇలా చెప్పసాగాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=4&padyam=20
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment