Wednesday, 12 February 2020

దక్ష యాగము - 32


(దక్షాధ్వర ధ్వంసము )

4-115-వ.
వెండియు నిట్లనిరి "కుపితాత్ముండైన దక్షుండు దన కూఁతుతో విరోధంబు చాలక జగత్సంహార కారణుం డయిన రుద్రునిం గ్రోధింప జేసె; అమ్మహాత్ముం డెంతటివాఁ డన్నం బ్రళయకాలంబున
4-116-సీ.
సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత;
నిఖిల దిక్కరి రాజనివహుఁ డగుచుఁ
జటులోగ్రనిష్ఠుర స్తనిత గంభీరాట్ట;
హాస నిర్భిన్నాఖిలాశుఁ డగుచు
భూరి కరాళవిస్ఫార దంష్ట్రా హతి;
పతిత తారాగణ ప్రచయుఁ డగుచు
వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ;
మండిత చండ దోర్దండుఁ డగుచు
4-116.1-తే.
వికట రోష భయంకర భ్రుకుటి దుర్ని
రీక్ష్య దుస్సహ తేజోమహిమఁ దనర్చి
ఘన వికీర్ణ జటాబంధ కలితుఁ డగుచు
నఖిల సంహార కారణుఁ డయి నటించు.
4-117-తే.
అట్టి దేవునిఁ ద్రిపుర సంహార కరునిఁ
జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు
మనము రోషింపఁ జేసిన మంగళములఁ
బొంద వచ్చునె పద్మగర్భునకునైన?"


భావము:
ఇంకా ఇలా అన్నారు “దక్షుడు కోపంతో తన కుమార్తెతో వైరం తెచ్చుకొనడమే కాక ప్రళయకారకుడైన రుద్రునకు కోపం తెప్పించాడు. మహాత్ముడైన ఆ శివుడు ఎంతటివాడంటే ప్రళయకాలంలో...
మహోగ్రమైన తన త్రిశూలాగ్రాన దిగ్గజాల నన్నిటిని గుది గ్రుచ్చేవాడై, దిక్కులన్నీ దద్దరిల్లి బీటలువారే విధంగా ఉరుమినట్లుగా గంభీరంగా అట్టహాసం చేస్తూ, తన వాడియైన గొప్ప కోరల ఘాతాలతో నక్షత్రమండలాన్ని నేల రాలుస్తూ, తన భయంకరమైన చేతులతో ధగధగ మెరిసే రకరకాల ఆయుధాలను ధరిస్తూ, ప్రచండ కోపంతో కనుబొమలను ముడివేసి, తేరి చూడరాని తేజస్సుతో, జడలను విరబోసుకొని ప్రళయనాట్యం చేస్తూ సర్వాన్ని సంహరిస్తాడు. అటువంటి దేవదేవునికి, త్రిపురసంహారికి, చంద్రచూడునకు, సకల సద్గుణ విభవునకు, అభవుని మనస్సుకు ఆగ్రహం తెప్పించి బ్రహ్మదేవుడైనా శుభాలను పొందగలడా?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=116

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...