Saturday 3 April 2021

శ్రీకృష్ణ విజయము - 190

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-96-సీ.
"కమలాక్ష! వినవయ్య! కాశీశుఁ డేలెడి-
  కుంభిని వానలు గురియకున్నఁ
గోరి శ్వఫల్కునిఁ గొనిపోయి యతనికిఁ-
  గాందిని యనియెడు కన్య నిచ్చి
కాశీవిభుండు సత్కారంబు సేసిన-
  వానలు గురిసె నా వసుధమీఁద;
నాతని పుత్త్రకుఁ డయిన యక్రూరుండు-
  నంతటివాఁడు, మహాతపస్వి
10.2-96.1-ఆ.
మరలి వచ్చెనేని మాను నుత్పాతంబు
లెల్ల; వాన గురియు నీ స్థలమున;
దేవ! యతనిఁ దోడితెప్పింపు; మన్నింపు;
మానవలయుఁ బీడ మానవులకు."
10.2-97-వ.
అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి పూజించి ప్రియకథలు కొన్ని సెప్పి సకలలోకజ్ఞుండు గావున మృదుమధుర భాషణంబుల నతని కిట్లనియె.

భావము:
“ఓ కమలాక్షా! కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుడి తండ్రి అయిన శ్వఫల్కుని తీసుకుని వెళ్ళి కాందిని అనే తన కూతురును ఇచ్చి వివాహంచేసి సత్కరించేడు. అప్పుడు కాశీరాజ్యంలో వానలు కురిశాయి. శ్వఫల్కుడు కుమారుడైన అక్రూరుడు కూడా అంతటి వాడే. మహాతపస్వి. అతడు తిరిగి వస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి. వానలు కురుస్తాయి. అతనిని రప్పించండి. మా మాట మన్నించండి. ప్రజల పీడను తొలగించండి.” ఈలా చెప్పిన పెద్దల మాటలను విని, శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుడిని రప్పించాడు. అతనిని సత్కరించి, ప్రియమైన పలుకులు పలికి, మృదుమధుర భాషణలతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=96

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...