Tuesday 6 April 2021

శ్రీకృష్ణ విజయము - 192

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-100-ఉ.
సంతసమంది బంధుజనసన్నిధికిన్ హరి దెచ్చి చూపె; న
శ్రాంతవిభాసమాన ఘృణిజాలపలాయిత భూనభోంతర
ధ్వాంతము, హేమభారచయవర్షణవిస్మిత దేవ మానవ
స్వాంతముఁ, గీర్తి పూరితదిశావలయాంతము నా శమంతమున్.
10.2-101-క.
చక్రాయుధుఁ డీ క్రియఁ దన
యక్రూరత్వంబు జనుల కందఱకును ని
ర్వక్రముగఁ దెలిపి క్రమ్మఱ
నక్రూరుని కిచ్చె మణిఁ గృపా కలితుండై.
10.2-102-క.
ఘనుఁడు భగవంతుఁ డీశ్వరుఁ
డనఘుఁడు మణి దెచ్చి యిచ్చినట్టి కథనమున్
వినినఁ బఠించినఁ దలఁచిన
జనులకు దుర్యశముఁ బాపసంఘముఁ దలఁగున్.

భావము:
శ్రీకృష్ణుడు సంతోషంతో ఆ మణిని తన బంధువుల కందరకూ చూపించాడు. ఆ శమంతకమణి తన కాంతితో సర్వలోకాల చీకట్లు పోగొట్టగలది, తనిచ్చే బంగారంతో దేవమానవులకు ఆశ్చర్యం కల్గించగలది, సర్వ దిగంతాల వరకూ నిండిన కీర్తిగలది. చక్రాయుధుడు తన నిష్కళంకత్వాన్ని అందరికీ తెలియజేసి, శమంతకమణిని తిరిగి అక్రూరునికే ఇచ్చివేశాడు. మహానుభావుడు పరమేశ్వరుడు, పాపరహితుడు, ఐశ్వర్యవంతుడు ఐన శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి, ఇచ్చిన కథను విన్నా, పఠించినా, తలచినా జనుల పాపాలు పటాపంచలవుతాయి; అపకీర్తి తొలగిపోతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=902

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...