Monday 7 June 2021

శ్రీకృష్ణ విజయము - 251

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-241-సీ.
కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా-
  ననువునఁ జందనం బల్ల నలఁది
కన్నీరు పన్నీటఁ గడిగి కర్పూరంపుఁ-
  బలుకులు సెవులలోఁ బాఱ నూఁది
కరమొప్ప ముత్యాలసరుల చి క్కెడలించి-
  యురమునఁ బొందుగా నిరవుకొలిపి
తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి-
  వదలిన భూషణావళులఁ దొడిగి
10.2-241.1-తే.
కమలదళ చారు తాలవృంతమున విసరి
పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందుపఱిచి
చిత్త మిగురొత్త నొయ్యన సేదఁదీర్చి
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి.
10.2-242-తే.
నెరులుగల మరునీలంపు టురుల సిరుల
నరులుగొనఁ జాలి నరులను మరులు కొలుపు
యిరులు గెలిచిన తుమ్మెద గఱులఁ దెగడు
కురుల నులిదీర్చి విరు లిడి కొప్పువెట్టి.

భావము:
శ్రీకృష్ణుడు వేగిరంగా ఆమె దేహానికి బాగా మంచిగంధం పూశాడు. కర్పూరపు పలుకుల్ని చెవులలో ఊదాడు. పన్నీటితో కన్నీటిని కడిగాడు. ముత్యాల మాలల చిక్కు తీసి వక్షస్థలం మీద సరిచేసాడు. ముఖాన తిలకం సరిదిద్దాడు. జారిపోయిన భూషణాలను అన్నిటినీ చక్క చేసాడు. తామరరేకుల విసనకఱ్ఱతో విసిరాడు. పైటను సరిచేసాడు. ముఖం నిమిరాడు. గట్టిగా కౌగలించుకుని సేదదీర్చి హృదయానందం కలిగించాడు. తుమ్మెదరెక్కలను మించిన, మానవుల్ని మరులుగొలిపే వినీల కుంతలాలను చక్కగా దువ్వి కొప్పుతీర్చి పూలతో అలంకరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=241

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...