Tuesday, 24 August 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౯(319)

( భూసురుని దౌత్యంబు )

10.2-645-తే.
వారు పుత్తేర వచ్చినవాఁడ నేను
నరవరోత్తమ! నృపుల విన్నపము గాఁగ
విన్నవించెద నామాట వినినమీఁద
ననఘ! నీ దయ! వారి భాగ్యంబు కొలఁది. "
10.2-646-వ.
అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె.
10.2-647-ఉ.
"వారిజనాభ! భక్త జనవత్సల! దుష్టమదాసురేంద్ర సం
హార! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం
కేరుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం
సారవిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా!
10.2-648-ఆ.
ఆర్త జనుల మమ్ము నరసి రక్షింపు మ
హాత్మ! భక్తజనభయాపహరణ!
నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ
చరణయుగము మాకు శరణ మనఘ!

భావము:
ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.” ఇలా పలికి, రాజుల విన్నపాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి ఈవిధంగా చెప్పసాగాడు. “శ్రీకృష్ణా! ఓ భక్తవత్సల! దుష్ట రాక్షసేంద్ర సంహార! బ్రహ్మ మహేశ్వర దేవేంద్రాది వందిత పాదసరోజా! సకలలోకులచే కీర్తింపబడే మహాప్రభావశాలి! సంసారవిదూరా! నందకుమారా! లక్ష్మీనాథా! మాధవా! అవధరించు. ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ములను కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=648

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...