Friday, 27 August 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౨(322)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-655-సీ.
శారదచంద్రికా సారంగరుచితోడ-
  జడముడికెంపు చేఁ జఱచి నవ్వ
శరదంబుదావృత సౌదామనీలతా-
  శోభఁ గాంచనకటిసూత్ర మలర
లలితపూర్ణేందుమండల కలంకముగతి-
  మృదుమృగాజినరుచి మించుఁ జూపఁ
గల్పశాఖాగ్రసంగతపుష్పగుచ్ఛంబు-
  లీలఁ గేలను నక్షమాల యమర
10.2-655.1-తే.
భూరిపుణ్యనదీతోయపూరణమునఁ
దగు కమండలు వొక్క హస్తమునఁ దనర
వెల్ల జన్నిద మఱుత శోభిల్ల వచ్చె
నారదుండు వివేకవిశారదుండు.
10.2-656-క.
చనుదెంచె నట్లు ముని నిజ
తనుకాంతుల నఖిలదిగ్వితానము వెలుఁగన్
వనజాప్తుఁ బోలి యయ్యదు
జనములుఁ గృష్ణుండు లేచి సంప్రీతిమెయిన్.
10.2-657-క.
వినయమున మ్రొక్కి కనకా
సనమునఁ గూర్చుండఁ బెట్టి సముచిత వివిధా
ర్చనములఁ దనిపి మురాంతకుఁ
డనియెన్ వినయంబు దోఁప నమ్మునితోడన్.

భావము:
శరశ్చంద్ర చంద్రికలాంటి శరీరకాంతులతో శిఖముడిలోని కెంపు కాంతుల పంతమాడుతుండగా; శరత్కాలమేఘం మీది మెరపుతీగలాగ తెల్లని దేహం మీద బంగారుమొలత్రాడు ప్రకాశిస్తుండగా; నిండుచంద్రునిలోని మచ్చలాగ నిండు దేహంపై జింకచర్మం విలసిల్లుతుండగా; కల్పవృక్షము కొమ్మకు ఉన్న పుష్పగుచ్ఛాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతుండగా; పుణ్యనదీజలాలతో నిండిన కమండలం మరొక చేతిలో విరాజిల్లుతుండగా; తెల్లని జందెం మెడలో మెరుస్తుండగా; నారదమహర్షి నందనందనుడి దగ్గరకు విచ్చేసాడు. ఈలాగున తన దేహకాంతులతో దిక్కులను వెలిగిస్తూ దివినుండి దిగివచ్చిన సూర్యునిలా నారదముని వచ్చాడు. కృష్ణుడు తక్కిన యాదవులు అందరూ సాదరంగా లేచి నిలబడ్డారు. ఆ మురాంతకుడైన శ్రీకృష్ణుడు నారదుడికి వినయంగా నమస్కరించాడు. బంగారుసింహాసనం ఆసీనుడిని చేసాడు. తగిన గౌరవమర్యాదలతో పూజించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=657

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...