Wednesday, 15 September 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౮(338)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-694-వ.
తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి; పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణి భూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్త్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబు లగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబు లగు వివిధోపచారంబులు గావించుచుండె. 

భావము:
అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారుపళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=694 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...