Friday 17 September 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౦(340)

( దిగ్విజయంబు ) 

10.2-697-సీ.
ధరణీశ! యొకనాఁడు ధర్మతనూజుండు-
  ప్రవిమల నిజసభాభవన మందు
హితులు, మంత్రులు, పురోహితులును, సుతులును-
  మిత్రులు, బంధువుల్‌, క్షత్రవరులుఁ,
బరిచారకులు, సూత, పాఠక, కవి, బుధ-
  వరులును, మునులును వరుసఁ గొలువఁ
జిరలీల నవరత్న సింహాసనస్థుఁడై-
  గొలువుండి వినతుఁడై నలిననాభు,
10.2-697.1-తే.
భువనరక్షణదక్షు, నద్భుతచరిత్రు,
యదుకులేశ్వరు, మురదైత్యమదవిభేది,
నాప్తు, నయవేదిఁ, జతురుపాయప్రవీణుఁ
జూచి యిట్లని పలికె నస్తోకచరిత!
10.2-698-తే.
"అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబుఁ
నెమ్మిఁ గావించు వేడుక నెమ్మనమున
నెనయుచున్నది యది నిర్వహింప నీవ
కాక నా కాత్మబంధువుల్‌ గలరె యొరులు? 

భావము:
పరీక్షిన్మహారాజా! ఒకనాడు తన సభాభవనంలో హితులూ, పురోహితులూ, పుత్రులూ, మిత్రులూ, సామంతులూ, చుట్టాలూ, సోదరులూ, స్తుతిపాఠకులూ, మునీశ్వరులూ పరివేష్టించి ఉండగా నిండుకొలువులో సింహాసనంపై ధర్మరాజు కూర్చుని ఉన్నాడు. పద్మనాభుడు, జగద్రక్షకుడు, మరాసురాది రాక్షసుల గర్వం సర్వం అణచిన వాడు, ఆత్మీయుడు, యదుకులేశ్వరుడు, సామ దాన భేద దండ ఆది చతురోపాయ పారాయణుడు అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. “పుణ్యచరితా! కృష్ణా! రాజసూయయాగం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. దానిని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=697 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...