Thursday, 7 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౦(360)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-748-చ.
భరితముదాత్ములై, విగతబంధనులై, నిజమస్తముల్‌ మురా
సురరిపు పాదపద్మములు సోఁకఁగఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై,
కరములు మోడ్చి "యో! పరమకారుణికోత్తమ! సజ్జనార్తి సం
హరణ వివేకశీల! మహితాశ్రితపోషణ! పాపశోషణా!
10.2-749-ఆ.
వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద!
దాసదుఃఖనాశ! వాసుదేవ!
యవ్యయాప్రమేయ! యనిశంబుఁ గావింతు
మిందిరేశ! నీకు వందనములు
10.2-750-ఉ.
ధీరవిచార! మమ్ము భవదీయ పదాశ్రయులన్ జరాసుతో
దారనిబంధనోగ్ర పరితాపము నీ కరుణావలోకనా
సారముచేత నార్చితివి; సజ్జనరక్షయు దుష్టశిక్షయు
న్నారయ నీకుఁ గార్యములు యాదవవంశపయోధిచంద్రమా! 

భావము:
బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు. కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా ఇలా స్తుతించారు. “ఓ దయామయా! సజ్జనుల దుఃఖాలను పోగొట్టేవాడా! ఆశ్రితరక్షకా! దురిత నివారణ! వరదా! పద్మనాభా! శ్రీహరీ! శ్రీకృష్ణ! వాసుదేవా! గోవిందా! ఇందిరావల్లభా! ఆశ్రిత ఆర్తి హరణా! శాశ్వతా! అనంతా! లక్ష్మీపతి! నీకు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము. యాదవవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడా! పరమజ్ఞానీ! శ్రీకృష్ణా! నీ పాదాలను ఆశ్రయించిన మాకు జరాసంధుడి బంధనాల వలన కలిగిన పరితాపాన్ని నీ కరుణాకటాక్షమనే జడివానతో చల్లార్చావు. అవును, సజ్జనులను రక్షించుట, దుర్జనులను శిక్షించుట చేయడమే నీ కర్తవ్యాలు కదా 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=750 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...