Friday, 22 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౪(374)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-784-క.
చంచత్కాంచన రుచిరో
దంచితవస్త్రముల నూతనార్కప్రభలన్
మించిన రత్నములం బూ
జించెన్ ధర్మజుఁడు కృష్ణు జిష్ణు సహిష్ణున్.
10.2-785-వ.
ఇట్లు పూజించి యానందబాష్పజల బిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని సుందరాకారంబు దర్శింపఁ జాలకుండె; నట్లు పూజితుండై తేజరిల్లు పుండరీకాక్షు నిరీక్షించి హస్తంబులు నిజమస్తకంబుల ధరించి వినుతుల సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు వివిధ తూర్యఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించి; రయ్యవసరంబున. 

భావము:
ధర్మరాజు బంగారు జలతారువస్త్రాలతో, బాలభానుడి కాంతులను మించిన కాంతులుగల రత్నాలతో ఆ జయశీలుడు, సర్వసహనశీలుడు అయిన శ్రీకృష్ణుడిని సన్మానించాడు. ఆ విధంగా ధర్మరాజు గోవిందుడిని పూజించి ఆనందబాష్పాలు కనుల నిండా కమ్ముటచే, ఆయన సుందరాకారాన్ని సరిగా చూడలేకపోయాడు. ఈ విధంగా పూజించబడి ప్రకాశించే పుండరీకాక్షుడు శ్రీకృష్ణుని చూసి సమస్త ప్రజలూ చేతులుజోడించి అనేక విధాల పొగడుతూ, జయజయ ధ్వానాలు చేశారు. దేవతల వివిధ మంగళ వాద్యాలు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=785 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...