10.2-822-సీ.
సుత సహోదర పురోహిత బాంధవామాత్య-
పరిచార భటకోటి బలసి కొలువఁ
గలిత మాగధ మంజు గానంబుఁ బాఠక-
పఠన రవంబునుఁ బ్రమద మొసఁగఁ
గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల-
సరసిజాననలు చామరములిడఁగ
మయ వినిర్మిత సభామధ్యంబునను భాస-
మాన సింహాసనాసీనుఁ డగుచు
10.2-822.1-తే.
నమర గణములు గొలువఁ బెంపారు ననిమి
షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర
సరసఁ గొలువున్న యత్తఱి దురభిమాని
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు.
10.2-823-ఉ.
కాంచనరత్నభూషణ నికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో
దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందువాయ వా
రించ సహోదరుల్ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నే
తెంచెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్.
భావము:
ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువుతీరి ఉండగా ఆయన పుత్రులు, తమ్ముళ్ళు, పురోహితులు, బంధుమిత్రులు, మంత్రులు, సేవకులు అయనను సేవిస్తున్నారు; వందిమాగధుల మధుర స్తోత్రాలు సంతోషాన్ని కలిగిస్తున్నారు; చేతి కంకణాలు మ్రోగుతుండ యువతులు వింజామరలు వీస్తున్నారు; అప్పుడు దేవతలు సేవిస్తుండగా ప్రకాశించే దేవేంద్రుడిలాగా కొలువుతీరి ఉన్నాడు; ఇలా కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడకి వచ్చి సువర్ణమయములైన మణిభూషణాలు ధరించి రాజసం ఉట్టిపడే తేజస్సుతో సేవకులు ముందు నడుస్తూ జనాన్ని ఒత్తిగిస్తుండగా తమ్ముళ్ళు రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవిస్తుండగా దుర్యోధనుడు వైభవోపేతంగా ధర్మరాజు సమక్షానికి విచ్చేసాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=823
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment