Saturday, 13 November 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౫(395)


( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-831-తే.
వసుధేశ! విను; మును వైదర్భి పరిణయ-
  వేళ దుర్మద శిశుపాలభూమి
వరునకుఁ దోడ్పడ నరుదెంచి సైనికా-
  వలితోడఁ దొడరి దోర్బలము దూలి
హరిచేత నిర్జితులైన రాజులలోనఁ-
  జైద్యుని చెలికాఁడు సాల్వభూమి
పతి జరాసంధాది పార్థివప్రకరంబు-
  విన మత్సరానల విపులశిఖల
10.2-831.1-తే.
"ధాత్రి నిటమీఁద వీతయాదవము గాఁగఁ
గడఁగి సేయుదు"నని దురాగ్రహముతోడఁ
బంతములు పల్కి యటఁ జని భరితనిష్ఠఁ
దపము కావింపఁ బూని సుస్థలమునందు.
10.2-832-క.
ధృతి వదలక యుగ్రస్థితిఁ
బ్రతిదినమునుఁ బిడికెఁ డవనిరజ మశనముగా
నతినియమముతో నా పశు
పతి, శంకరు, ఫాలనయను, భర్గు, నుమేశున్. 

భావము:
ఓ రాజా! రుక్మిణీ స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి, కృష్ణుడిని ఎదిరించి, అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో, మొండిపట్టుదలతో “యాదవులను అందరిని నాశనం చేస్తాను” అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేసాడు. అటుపిమ్మట అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేయటానికి ఉపక్రమించాడు. అలా ఉపక్రమించిన సాల్వుడు ప్రతిదినం పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలగా పరమేశ్వరుని గురించి భీకర తపస్సు చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=832 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...