10.2-838-సీ.
సరిదుపవన సరోవరములు మాయించి-
బావులు గలఁచి కూపములు సెఱిచి
కోటలు వెస వీటతాటముల్ గావించి-
పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి
యట్టళ్లు ధరఁ గూల్చి యంత్రముల్ దునుమాడి-
కాంచనధ్వజపతాకములు నఱకి
భాసుర గోపుర ప్రాసాదహర్మ్యేందు-
శాలాంగణములు భస్మములు చేసి
10.2-838.1-తే.
విమల కాంచనరత్నాది వివిధవస్తు
కోటి నెల్లను నందంద కొల్లపుచ్చి
ప్రజలఁ జెఱపట్టి దొరలను భంగపెట్టి
తఱిమి యిబ్భంగిఁ బెక్కుబాధల నలంచి.
10.2-839-చ.
మదమున నంతఁ బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్
గొదకొని యేపుమై నెగసి కొంకక శక్తి శిలా మహీరుహ
ప్రదరము లోలిమైఁ గురిసి బంధురభూమిపరాగ శర్కరల్
వదలక చల్లుచున్ వలయవాయువుచే దిశ లావరించుచున్.
భావము:
ద్వారకానగరంలోని సెలయేర్లను ఉపవనాలను ధ్వంసం చేయించాడు; చెఱువులు బావులు పూడిపించాడు; కోటలను ఛిన్నాభిన్నము చేయించాడు; అగడ్తలను పాడుచేసాడు; కోటగోడలను పడగొట్టించాడు; ప్రాకారాలు బురుజులు కూలదోయించాడు; యంత్రాలను ధ్వజపతాకాలనూ నరకించాడు; గోపురాలను మిద్దెలను మేడలను చంద్రశాలలను కాల్చి బూడిద చేసాడు; పట్టణంలోని బంగారాన్ని రత్నాలు మొదలైన వస్తువులను కొల్లగొట్టాడు; ప్రజలను చెఱపట్టాడు; అధికారులను అవమానించాడు; ఇలాగ సాల్వుడు ద్వారకలోని ప్రజలను పెక్కు బాధలకు గురిచేసాడు. అంతటితో వదలిపెట్టకుండ విమానం ఎక్కి సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చర్నా(చిల్ల)కోలల్లా ఉన్న తీగలు, గడ్డిపోచలు, చెట్లు, కొమ్మలు, రాళ్ళు, బాణాలు వరసపెట్టి కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దట్టమైన దుమ్ము ధూళితో ఇసుకరేణువులతో కూడిన సుడిగాలులు విసురుతూ కల్లోలపరచాడు
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=839
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment