Saturday 27 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౮(408)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-864-క.
అక్రూరుఁడుఁ దదనుజులు న
వక్రపరాక్రమము మెఱసి వైరుల బాహా
విక్రమమున వధియించిరి
చక్రప్రాసాది వివిధ సాధనములచేన్.
10.2-865-మ.
కృతవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి
శ్రితవర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న
ద్భుతకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర
క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా!
10.2-866-వ.
అయ్యవసరంబున సాల్వుండు గోపోద్దీపితమానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు. 

భావము:
అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు. అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=865 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...