Monday 6 December 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౬(416)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-887-శా.
కంటే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్‌ మహాభీలముల్‌
మింటన్ మేదినిఁ దోఁచుచున్నయవి; నెమ్మిన్ ఖాండవప్రస్థ మే
నుంటం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిం
గెంటింపం జనుదేరఁ బోలుదురు; పోనీ తేరు వేగంబునన్."
10.2-888-వ.
అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు డగ్గఱి మహాబల పరాక్రమంబులం బ్రతిపక్షబలంబులతోడం దలపడి పోరు యదు బలంబులును నభోవీథి నభేద్య మాయా విడంబనంబునం బ్రతివీరు లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవి గాని సౌభకవిమానంబు నందున్న సాల్వునిం గని తద్విమానంబు డాయం దన తేరు దోల సారథిని నియమించి కదియంజను మురాంతకుని వీక్షించి యదు సైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుంగొని సౌభకపతి విక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి. 

భావము:
చూడు దారుకా! అపశకునాలు ఆకాశంలోను, భూమి మీద అతిభీకరంగా కనబడుతున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉన్న విషయం తెలుసుకొని శిశుపాలుడి మిత్రులైన రాజులు మన పట్టణం మీద యుద్ధానికి తలపడినట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనియ్యి. ఈ విధంగా శ్రీకృష్ణుడు పలుకగా, దారుకుడు మిక్కిలి వేగంతో రథం పోనిచ్చాడు. అలా శీఘ్రమే ద్వారకను సమీపించి, వాసుదేవుడు బలపరాక్రమాలతో శత్రుసైన్యంతో తలపడి యుద్ధం చేసే యాదవసైన్యాన్ని, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసం చేస్తూ యాదవవీరులను; ఎంత కాలానికి భేదింప సాధ్యం కాకుండా తిరుగుతున్న సౌభక విమానాన్నీ, అందులో ఉన్న సాల్వుడిని చూసాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. శ్రీకృష్ణుడిని వీక్షించిన యదుసైన్యాలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి దైన్యంగా ఉన్న తన సైన్యాన్ని చూసి సాల్వుడు పరాక్రమించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=887 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...