Sunday 16 January 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౧(451)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-965-సీ.
అనుడు వేదవ్యాసతనయుఁ డా యభిమన్యు;
తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి
"జనవర! గోవింద సఖుఁడు కుచేలుండు;
నా నొప్పు విప్రుండు మానధనుఁడు
విజ్ఞాని రాగాది విరహితస్వాంతుండు;
శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు
విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు;
బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి
10.2-965.1-తే.
నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి
కాసు పదివేల నిష్కముల్‌ గాఁ దలంచి
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష
యొక విధంబున నడుపుచు నుండు; నంత
10.2-966-సీ.
లలితపతివ్రతా తిలకంబు వంశాభి;
జాత్య తద్భార్య దుస్సహ దరిద్ర
పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు;
శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి
మలమల మాఁడుచు మానసం బెరియంగఁ;
బట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ
బత్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి;
వేఁడిన వీనులుసూఁడినట్ల
10.2-966.1-ఆ.
యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ
జేరి యిట్లని పలికె "నో జీవితేశ!
తట్టుముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు
నొంప దీని కుపాయ మూహింప వైతి. " 

భావము:
ఇలా అడిగిన ఆ అభిమన్య పుత్రునితో, వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకుడు సంతోషంతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిని సాధ్వి. బిడ్డలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో “ప్రాణేశ్వరా! ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=966 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...