Thursday 27 January 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౨(462)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-989-క.
మురసంహరుఁడు కుచేలుని
కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ మన మా
గురుగృహమున వర్తించిన
చరితము లని కొన్ని నుడివి చతురత మఱియున్
10.2-990-సీ.
"బ్రాహ్మణోత్తమ! వేదపాఠనలబ్ధ ద;
క్షత గల చారువంశంబు వలనఁ
బరిణయంబైనట్టి భార్య సుశీలవ;
ర్తనములఁ దగభవత్సదృశ యగునె?
తలఁప గృహక్షేత్ర ధనదార పుత్త్రాదు;
లందు నీ చిత్తంబు సెందకుంట
తోఁచుచున్నది; యేనుదుది లోకసంగ్రహా;
ర్థంబు కర్మాచరణంబుసేయు
10.2-990.1-తే.
గతి, మనంబులఁ గామమోహితులు గాక
యర్థిమై యుక్తకర్మంబు లాచరించి
ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ఠ
దవిలియుందురు కొంద ఱుత్తములు భువిని. " 

భావము:
కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని, తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి, కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు. “ఓ భూసురోత్తమా! చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద, భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుట లేదు. లోకకల్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=990 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...