Monday 20 June 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౨(572)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1195-క.
ముని యోగిమానసస్ఫుట
వనజంబుల నెల్ల ప్రొద్దు వర్తించు భవ
ద్ఘనదివ్యమూర్తి నా లో
చనగోచర మయ్యెఁ గాదె! సర్వాత్మ! హరీ!
10.2-1196-వ.
దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు, నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం, దమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;” వని మఱియు నిట్లనియె.

భావము:
ఓ సర్వాంతర్యామీ! శ్రీహరీ! మునీశ్వరుల యోగీంద్రుల హృదయ పద్మాలలో నిరంతరం మెలిగెడి నీ యొక్క దివ్య మంగళరూపం నా కనులకు గోచరమైంది. ఓ దేవా! చెవులపండువుగా నీ దివ్యగాథలు వింటూ; నీకు పూజలు చేస్తూ; నీ పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ; నీ దివ్యనామం జపిస్తూ; తమ శరీరాలు నీ ఆధీనాలుగా సంచరిస్తూ; ఉండే సజ్జనుల హృదయాలనే అద్దాలలో నీవు కనిపిస్తూ ఉంటావు; కర్మపరతంత్రులైన వారి హృదయాలకు దూరంగా ఉంటావు.” అని స్తుతించి శ్రుతదేవుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1196

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...