Tuesday 2 August 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౮(598)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1242-సీ.
దీపించు కేదార తీర్థంబునకు నేగి-
  యతిసాహసాత్మకుం డగుచు నియతి
లోకముల్‌ వెఱఁగంద నా కాలకంధరు-
  వరదుని నంబికావరునిఁ గూర్చి
తన మేనికండ లుద్దండుఁడై ఖండించి-
  యగ్ని కాహుతులుగా నలర వేల్చి
దర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న;-
  జడియక సప్తవాసరము నందుఁ
10.2-1242.1-తే.
బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు
వెడలి మృత్యువు కోఱనా వెలయునట్టి
గండ్రగొడ్డంటఁ దన మస్తకంబు దునుము
కొనఁగఁ బూనిన నయ్యగ్నికుండమునను.

భావము:
వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్ళాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోరతపస్సు చేసాడు. ఆ తీవ్రతపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరం లోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడ మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్ధంలో స్నానం చేసి మృత్యుకోరవంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నఱికుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతట ఆ అగ్నికుండంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1242

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...