Saturday 20 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౬(606)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1262-క.
మురహరుఁ డెల నవ్వొలయఁగఁ
బురుహరుఁ దగఁ జూచి పలికె "భూతేశ్వర! యీ
నరభోజనుండు నీ కి
త్తఱి నెగ్గొనరింపఁ దలఁచి తానే పొలిసెన్.
10.2-1263-వ.
అది యట్టిద కాదె! యిజ్జగంబున నధికుండయిన వానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే? యదియునుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞ దలంచు కష్టాత్ముండు వొలియుటం జెప్పనేల? యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబులిచ్చుట కర్జంబు గా"దని యప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు ననేక విధంబుల నభినందించి నిజ మందిరంబునకుం జనియె" నని చెప్పి యిట్లనియె.

భావము:
మురాసురసంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమ శివుడితో ఇలా అన్నాడు “భూతేశ్వరా! ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు.” అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్ళిపోయాడు.” అని చెప్పి మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1263

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...