Thursday, 10 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( అంతరిక్షు సంభాషణ ) 

11-54-వ.
“సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహ కళత్ర మిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్నులయి గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మేలనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై, విషయాసక్తతం జిక్కి, తమ్ముఁ దారెఱుంగక యుండి, విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢు లగు జనంబుల పొంతలఁ బోవక; కేవల నారాయణ భక్తి భావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్యవ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమము, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణ విశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితర దర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె.

భావము:
“ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతు కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:
1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=54

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...