Monday 5 December 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౩(693)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-79-వ.
ఇవ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది మహానదీపావనజల స్నాన పాన దానంబులను, విష్ణుధ్యానకథాసుధార సానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడని పదంబునుం బొందుదు” రని ఋషభకుమారులు భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబు లైన భగవద్భక్తి ధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయురారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్ర వంతులై సకల కలికల్మష రహితులై విష్ణులోక నివాసు లగుదు” రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును.

భావము:
ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=79

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...