Thursday, 15 December 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౮(698)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-87-సీ.
కాక ఘూకంబులు గనకసౌధములలోఁ-
  బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె-
  నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల-
  జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె-
  బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
11-87.1-తే.
గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
నరయ నిందుండ వలవదు యదువులార!
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.

భావము:
శ్రీకృష్ణుడు యాదవులను ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=15&Padyam=87

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...