Monday, 9 November 2015

ద్వారక అస్తమయం - 10:


అర్జునుడు ఆ తరువాత కృష్ణుడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుడు మనసులో " అయ్యో కృష్ణా ! నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్థిన నుండి ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణవార్తను నీకు చెప్పడానికి నీ వద్దకు వస్తున్నను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యము కలుగుతుందా ! అయినా నేనిప్పుడు వసుదేవుడి మరణవార్తను బలరామ, కృష్ణులకుచెప్పడము ఎందుకు ? మీరు చెప్పిన పనిని సక్రమంగా పుర్తి చేసాను అని చెపితే సరిపోతుంది కదా ! " అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునుడికి గాంధారి ఇచ్చిన శాపము మనసులో మెదిలింది.

గాంధారి శాపము ఇచ్చే సమయములో అర్జునుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. గాంధారి " ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు దిక్కు లేకుండా చస్తావు " అని శపించింది. అయినా మహానుభావుడైన శ్రీకృష్ణుడి మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా! ఇలా పరిపరి విధముల ఆలోచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట వస్తున్న వాళ్ళకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సాహసించలేక పోతున్నారు. అలా కొన్ని రోజులు వెదికిన తరువాత ఒక రోజు ఒక బోయవాడు వారితో " మీరు దేని కొరకు వెదుకుతున్నారు? "అని అడిగాడు. 

అర్జునుడు " ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుడు తపసు చేసుకుంటున్నాడట అతడి కొరకు మేము వెదుకుతున్నాము " అన్నాడు. ఆ బోయవాడు " నేను శ్రీకృష్ణుడిని చాలా రోజుల కిందట చూసాను. తరువాత చూడలేదు. నేను కూడా మీ వెంటవచ్చి వెతుకుతాను రండి " అన్నాడు. ఆ బోయవాడితో చేరి అర్జునుడు కృష్ణుడి కొరకు వెదకసాగాడు. ఆ బోయవాడు చెప్పిన ఆధారాలను అనుసరించి వారు కృష్ణుడు పడిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు దిక్కు లేకుండా దివ్యకాంతులు వెదజల్లుతూ పడి ఉన్న శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని చూసారు. ఆ దృశ్యము చూసిన అర్జునుడు అక్కడకక్కడే మూర్ఛిల్లాడు. పక్కన ఉన్న వారు నీళ్ళు తీసుకువచ్చి అర్జునుడి ముఖము మీద చల్లారు.

అర్జునుడు మూర్ఛ నుండి లేచి శ్రీకృష్ణుడి శరీరాన్ని కౌగలించుకుని భోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యమూ నిగ్రహము అతడిలో సడలిపోయాయి. కళ్ళ వెంట నీరు ధరాపాతంగా కారి పోతున్నాయి. నోటమాట రాలేదు. పక్కన ఉన్న వారికి అర్జునుడిని పలకరించే సాహసము చెయ్యలేక పోయారు. కొంచము సేపటికి తెప్పరిల్లిన అర్జునుడు " అయ్యో ! కృష్ణా ! నీకా ఈ దురవస్థ. నీ వంటి మహాత్ముడు ఇలా కటిక నేల మీద పడి ఉండడమా !అంటూ కృష్ణుడి పాదాల వంక చూసి అరికాలులో దిగిన బాణము గమనించాడు. అతడికి దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చాయి..... ( ఇంకా వుంది )





No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...