అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపొయాడు. కృష్ణుడి దేహము అంతా పరికించి చూసాడు. అరికాలు మాత్రము నల్లగా కమిలి ఉంది. మిగిలిన దేహము దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంది. నిదురిస్తున్నట్లు కనిపిస్తున్న శ్రీకృష్ణుడిని అర్జునుడు కళ్ళు ఆర్పకుండా చూడసాగాడు. పక్కన ఉన్న వాళ్ళు " అయ్యా ! తరువాత కార్యక్రమాలు చూడండి. మనము పోయి ద్వారకలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాము. లేకున్న శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకు వెళదాము. ఎలా చెయ్యాలో మీరే సెలవియ్యండి " అన్నారు.
అర్జునుడు ఆలోచించి చూడగా ద్వారక మునిగిపోతుంది అన్న రోజు మరునాడే అని గ్రహించాడు. అర్జునుడు తన వెంట వచ్చిన వారితో " రేపు ఉదయము ద్వారక సముద్రములో మునుగుతుంది. కనుక మనము ఈ రాత్రికి ద్వారకకు వేళ్ళాలి. అందరినీ సమాయత్తము చేసి రేపు ఉదయానికి ముందుగా ద్వారకను విడిచి పెట్టాలి. లేకున్న అంతు లేని ప్రాణ నష్టము జరుగుతుంది కనుక మనము శ్రీకృష్ణుడి నిర్యాణము గురించి ఎవ్వరికీ ఇప్పుడు చెప్పవద్దు. ప్రస్తుతము శ్రీకృష్ణుడి అంత్యక్రియలు మనము నిర్వహిస్తాము " అన్నాడు. బరువెక్కిన హృదయముతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేసాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని వేదోక్తంగా దహనము చేసాడు.బలరాముడు కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకుని చుట్టుపక్కల వెదుకసాగారు.
కొంత సేపటికి వారి శ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగసమాధిలో ప్రాణములు వదిలిన బలరాముడి పార్థివ శరీరము వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి కూడా సమయము చిక్కలేదు. భక్తిశ్రద్ధలతో బలరాముడికి దహన సంస్కారము చేసాడు. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తి శ్రద్ధలతో దహన సంస్కారములు చేసాడు. తరువాత తన వెంట వచ్చిన వారిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. మార్గమధ్యములో దారుకుడితో " దారుకా ! మనము చేసిన పని సరి అయినది అని నేను నమ్ముతునాను.
లేకున్న శ్రీకృష్ణుని మరణవార్తను విన్న రుక్మిణీ, సత్యభామమొదలైన భార్యల దుఃఖము ఆపడము మనతరమా చెప్పు. వారంతా సహగమనము చేస్తాము అంటే మనము ఆపగలమా ! రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తరువాత సముద్రము పొంగి ద్వారక మునిగి పోతుంటే ద్వారక వాసులను కాపాడ లేదన్న అపఖ్యాతి నాకు వస్తుంది. పైగా శ్రీకృష్ణుడి మాట తప్పిన వాడిని ఔతాను. కనుక మనము వడిగా ద్వారకకు చేరుకుంటాము " అన్నాడు. అందరూ కలసి త్వరగా ద్వారక చేరుకున్నారు...... ( ఇంకా వుంది )
No comments:
Post a Comment