(23-11-2015, సోమవారం )
హిందూమత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మనకున్న మాసాలలో ఎంతో పుణ్యమైనది కార్తీకమాసం. ఈ కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో విశిష్టమైనది కూడా. కార్తీకమాసంలో వచ్చే
శుద్ధపక్ష ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. దేవదానవులు క్షీర సాగరాన్ని చిలకడం వలన ఈ రోజుకు చిలుకు ద్వాదశి అనే పేరు వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు పవళించిన శ్రీమహావిష్ణువు.. కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు. ఆ మరుసటిరోజే అయిన క్షీరాబ్ది ద్వాదశినాడు విష్ణువు లక్ష్మీ సమేతుడై, బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి చేరుకుంటాడు. అలా చేరుకోవడంతో ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుచుకుంటారు.
దాని తర్వాత వచ్చేరోజు క్షీరాబ్ది ద్వాదశిని ఎంతో పుణ్యంగా భావించి, పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లతో కూడా పేర్కొంటారు. క్షీరాబ్ది ద్వాదశిరోజు పుణ్యనదిలో స్నానం చేసుకుంటే.. సమస్త పాపాలు తొలగిపోయి అనంతపుణ్యం లభిస్తుందని ప్రతిఒక్కరు ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే సూర్యగ్రహణ సమయంలో అన్నదానం చేయడంవల్ల.. కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాల కథనాలలో చెప్పబడింది.
క్షీరాబ్ది ద్వాదశిరోజు శ్రీ మహావిష్ణువు సకలసిరులతో
ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన రోజుకాబట్టి, ఆరోజు సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి,విష్ణువుకు, లక్ష్మీదేవికి
వివాహం జరిపిస్తారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారంగానే నిర్వహించుకుంటారు. అదెలా అంటే.. తులసీదేవినిలక్ష్మీదేవిగానూ, ఉసిరిచెట్టును శ్రీమహావిష్ణువును తలచుకోవడం వల్ల ఆ రెండింటిని కలిపి.. లక్ష్మీదేవి, విష్ణువులను పూజించి, వివాహం చేస్తారు. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశిని ఒక పండుగ
శుభదినంగా ప్రతిఒక్కరు జరుపుకుంటారు.
అంబరీషుడు - ద్వాదశి వ్రతం:
అంబరీషుడు సదా శ్రీ మహావిష్ణువును సేవిస్తూ ఉండేవాడు. ఎప్పటిలానే ఆ ఏడాది కూడా అంబరీషుడు తన భార్యతో కలిసి 'ద్వాదశీ వ్రతం' చేశాడు. వ్రతం పూర్తి కావడంతో మూడు రోజులపాటు ఉపవాసంచేసి 'కాళిందీనది'లో స్నానంచేసి శ్రీ
మహావిష్ణువును పూజించాడు. ఆ తరువాత వేలాది
గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చి, వారికి సమారాధన జరిపించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి దుర్వాసుడు వచ్చాడు. ఆయనని అంబరీషుడు ఎంతో మర్యాదగా ఆహ్వానించి భోజనంచేసి వెళ్లవలసిందిగా కోరాడు. సంధ్య వార్చుకుని వస్తానంటూ కాళిందీనదికి వెళ్ళాడు దుర్వాసుడు. ఆయన ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో అంబరీషుడు ఆలోచనలో పడ్డాడు. అతిధి రాకుండా భోజనంచేయడం మహా పాపం.. అలాగని ఎదురుచూస్తూ కూర్చుంటే ద్వాదశి ఘడియలు పూర్తి కావొస్తున్నాయి. మంచినీళ్లు తాగడం వలన వ్రత ఫలితం దక్కుతుందని పండితులు చెప్పడంతో, అంబరీషుడు ఆ విధంగానే చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన దుర్వాసుడు, తనని అవమానపరిచావంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ తన తపోబలంతో 'కృత్య' అనే శక్తిని అంబరీషుడు పై ప్రయోగించాడు. అది గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ సుదర్శన చక్రం కృత్యను అంతం చేసి దుర్వాసుడు పైకి దూసుకువెళ్లింది. భయంతో దుర్వాసుడు ఎక్కడికి పరిగెత్తినా అక్కడికి ఆ సుదర్శన చక్రం వస్తూనే వుంది. ఆ సుదర్శన చక్రం నుంచి తనని కాపాడమంటూ ఆయన బ్రహ్మ రుద్రులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. దాంతో చేసేది లేక చివరికి శ్రీ మన్నారాయణుడినే శరణు వేడాడు. తనని
అవమానపరిచినా భరిస్తానుగానీ,తన భక్తులను బాధపెడితే మాత్రం సహించనని చెబుతూ, అంబరీషుడిని శరణు వేడటం మినహా మరో మార్గం లేదని చెప్పాడు శ్రీ మహా విష్ణువు. దాంతో అక్కడికి పరిగెత్తుకు వెళ్లి తన తప్పును క్షమించమంటూ అంబరీషుడిని దీనంగావేడుకున్నాడు. అంబరీషుడి ప్రార్ధనని మన్నించి సుదర్శన చక్రం శాంతించింది. శ్రీ హరి భక్తులు ఎంతటి శక్తివంతులో తెలుసుకున్న దుర్వాసుడు, అంబరీషుడి కోరిక మేరకు భోజనం చేసి మనస్పూర్తిగా "ఓ రాజా! ఈ రోజు లోకాలన్నిటికీ నీ
భక్తి యొక్క గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిధి నాడు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందెదరు గాక'' అని అనుగ్రహించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది.
జై శ్రీ రామ....
No comments:
Post a Comment