Sunday, 20 December 2015

వైకుంఠ ఏకాదశి...

21-12-2015... రేపే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.

పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటిఏకాదశి అంటారు. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన,పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్నదానం చేస్తారు. ఒక రోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండడం చాలా శ్రేష్ఠం. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటి నుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు...

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...