భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు
( 30 - 09 - 2016 నుండి 09-10-2016 వరకు )
బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ ఇది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గూనుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. గూనుగు పూలను వివిధ రంగులలో ముంచి రకరకాలుగా వాడతారు. ముందు ఒక పెద్ద తాంబాళంలో పెద్దపెద్ద ఆకులను వేసి దాని చుట్టూ ఒక్కో పువ్వును పెట్టుకుంటూ మధ్యలో ఆకులు నింపుకంటూ బతుకమ్మను పెరుస్తారు. పైన ఒక పెద్ద గుమ్మడి పువ్వును పెట్టి దాని పైన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఇలా రోజూ తయారుచేస్తారు. బతుకమ్మను సాగనంపే ముందు ఆ గౌరమ్మను తమ మంగళసూత్రాలకు అద్దుకంటారు.
కాకతీయుల కన్నా పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు పాలించేవారు. వారిలో సత్యాశ్రయుడనే రాజు ముఖ్యుడు. వేములవాడ లోని రాజరాజేశ్వస్వామి తెలంగాణ ప్రజల కొంగు బంగారం మరియు ముఖ్య దైవం. వేములవాడలోనే భీమేశ్వరాలయం కూడా ఉండేది. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రాన్ని పరాంతక సుందర చోళుడు పాలించేవాడు. పరాంతక చోళుడు రాష్ట్రకుటుల బారి నుండి తన రాజ్యాన్ని రక్షించకోలేక సతమతమౌతుండేవాడు. కాని శైవుడైన పరాంతక చోళుడు రాజరాజేశ్వరుని భక్తుడై తన కొడుక్కి రాజరాజ చోళుడని నామకరణం చేశాడు.
ఆ తరువాత కొద్ది కాలానికి రాజరాజ చోళుడి కొడుకు రాజేంద్ర చోళుడు వేములవాడపై దండెత్తి సత్యాశ్రయుడిని ఓడించి, భీమేశ్వరాలయంలోని లింగాన్ని తన తండ్రికి కానుకగా తంజావూరుకు తీసుకెళ్ళి అక్కడే ఆ లింగానికి బృహదీశ్వరాలయం పేరున గుడి కట్టించాడు. ఇప్పుడు భీమేశ్వరాలయంలోని లింగానికి, బృహదీశ్వరాలయంలోని లింగానికి సారూప్యత మనం గమనించవచ్చు.
ఆ తరువాత తెలంగాణ ప్రజలు తమ దగ్గరి నుండి వెళ్ళిపోయిన శివుడిని గురించి బాధపడుతూ, పార్వతీదేవిని ఓదారుస్తూ రంగురంగుల పూలతో త్రకోణాకారంగా బతుకమ్మను తయారు చేసి దానిపైన పుసుపుతో చేసిన గరీదేవిని ఉంచి సాయంత్రం వేళలో ఆరుబయట వీధిలోని ఆడపడుచులంతా కలిసి ఒకే దగ్గరకి చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడేవారట. అదే కాలక్రమేణా ఒక పండుగగా రూపాంతరం చెందింది.
ఈ విషయం క్రింది పాటలో మనం గమనించవచ్చు.....
ఒక్కేసి పూవ్వేసి చందమామ
ఒక్క ఝాములయ్యే చందమామ.....
శివుడొచ్చే వేళాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ......
ప్రతీ రోజు బతుకమ్మను ఒక్కోపేరుతో పిలస్తూ, ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.
1వ రోజు - ఎంగిలి పూవు బతుకమ్మ - నువ్వులు, బియ్యపు పిండి.
2వ రోజు - అటుకుల బతుకమ్మ - చప్పిడి పప్పు, బెల్లం , అటుకులు.
3వ రోజు - ముద్ద పప్పు బతుకమ్మ - ముద్ద పప్పు, పాలు, బెల్లం.
4వ రోజు - నానబియ్యం బతుకమ్మ - నానబెట్టిన బియ్యం, పాలు,బెల్లం.
5వ రోజు - అట్ల బతుకమ్మ - అట్లు
6వ రోజు - అలిగిన బతుకమ్మ - నైవేద్యం ఉండదు.
7వ రోజు - వేపకాయల బతుకమ్మ - బియ్యపు పిండిని వేపకాయలలాగా చేసి నూనెలో వేయించి సమర్పిస్తారు.
8వ రోజు - వెన్నముద్దల బతుకమ్మ - నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం.
9వ రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, కొబ్బరన్నం మరియు నువ్వుల అన్నం.
ఈ పండుగలో పరమార్థం ఏమిటంటే బతుకమ్మను తయారు చేయడంలో మనం రకరకాల పూలను వాడతాం, ఎన్ని పూలు వాడిన కానీ అవన్ని పైకి పోతూ చివరకు గౌరమ్మ దగ్గరే కలిసిపోతాయి. అలాగే మనం కూడా మెల్లమల్లగా ఈ ప్రాపంచిక విషయాలను అంటకుండా ఆ ఆదిశక్తినే చేరుకోవాలి.
ప్రతి పాటలోని చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు వాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శసి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైన పాటలు కూడా పాడతారు. అన్నిటికన్నా సద్దుల బతుకమ్మను చాలా వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మకు ముందు చిన్నపిల్ల చేత బొడ్డెమ్మ ఆడించడం ఆనవాయితి.
బతుకమ్మ పాటలు చాలా బాగుంటాయి....
ఉదాహరణకు కొన్ని....
రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో ॥2॥
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరాదు ఉయ్యాలో ॥2॥
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో ॥2॥
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాలో ॥2॥
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తారామాస ఉయ్యాలో ॥2॥
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో ॥2॥
- - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - -
తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో ॥2॥
వారిద్దరు ఒత్తురా ఉయ్యాలో
వీరిద్దరు ఒత్తురా ఉయ్యాలో ॥2॥
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లే ఉయ్యాలో ॥2॥
తంగేడు పూలనే ఉయ్యాలో
రాశిగా తెచ్చిరి ఉయ్యాలో ॥2॥
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ ఏడాదికి ఉయ్యాలో ॥2॥
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో ॥2॥
* * * * * * * * * * * * * * * * * *
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!
* * * * * * * * * * * * * * * * * *
చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
* * * * * * * * * * * * * * * * * * * *
ఇలా ఇంకా చాలా పాటలున్నాయి.... ఇలా బతుకమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.....
No comments:
Post a Comment