Tuesday, 27 August 2019

కపిల దేవహూతి సంవాదం - 100


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1012-వ.
అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీసంగంబుచే విత్తాపత్య గృహాదిప్రదం బగు స్త్రీత్వంబు నొందు; ఈ క్రమంబున నంగనా రూపుం డగు జీవుండు మన్మాయచేఁ బురుషరూపంబు నొంది ధనాదిప్రదుం డగు భర్తను నాత్మబంధకారణం బగు మృత్యువునుగ నెఱుంగ వలయు; మఱియు జీవోపాధిభూతం బగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం బ్రారబ్ద కర్మఫలంబుల ననుభవించుచు; మరలం గర్మాదులందాసక్తుఁ డగుచు మృగయుండు గాననంబున ననుకూల సుఖప్రదుం డైనను మృగంబునకు మృత్యు వగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం బైన దేహంబు గలిగి యుండు; అట్టి దేహనిరోధంబె మరణంబు; ఆవిర్భావంబె జన్మంబునుం; గాన సకల వస్తువిషయ జ్ఞానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రయం బగు ద్రష్టదర్శనీయ యోగ్యతాప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవు; గావున భయకార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు జ్ఞానంబునం దెలిసి ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ్యయుక్తం బైన సమ్యగ్జ్ఞానంబున మాయావిరచితం బైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింప వలయు" నని చెప్పి; వెండియు నిట్లనియె.

భావము:
అటువంటి పురుషరూపాన్ని ధరించిన జీవుడు ఎడతెగని స్త్రీసాంగత్యంవల్ల భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి పెంచుకొని వచ్చే జన్మలో స్త్రీగానే జన్మిస్తాడు. ఈ విధంగా స్త్రీత్వాన్ని పొందిన జీవుడు నా మాయవల్ల పురుషరూపాన్ని పొంది ధనాదులను ఇచ్చే భర్తను సంసారబంధనానికి కారణంగా తెలుసుకోవాలి. ఈ సంసారబంధమే మృత్యువు. జీవునకు ఆధారంగా లింగమయ దేహం నిలిచి ఉంటుంది. ఆ లింగమయదేహంతో తనకు నివాసమైన ఈ లోకంనుండి వేరు లోకాలను పొందుతూ పూర్వకర్మలయొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, తిరిగి కర్మలపై ఆసక్తుడు అవుతూ ఉంటాడు. మనస్సుతో పంచభూతాలతో పంచేంద్రియాలతో ఏర్పడి సుఖ సాధనమైన దేహం క్రమంగా శుష్కించి నశిస్తుంది. అడవిలో వేటగాడు మృగాలకు గానాదులతో అనుకూలమైన సదుపాయాలు కూర్చేవాడైనా, అతడే మృగాలపాలిటికి మృత్యువుగా పరిణమిస్తాడు. అట్టి దేహాన్ని చాలించడమే మరణం. దానిని పొందడమే జననం. కనుక సకల వస్తువులకూ సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి జీవునకు సాధనం కన్ను. ద్రష్ట చూడదగిన దానిని చూడడం అనే యోగ్యత సంపాదించుకున్నప్పుడు జీవునకు పుట్టడం, గిట్టడం అనేవి ఉండవు. కాబట్టి మానవుడు పిరికితనాన్నీ, దైన్యభావాన్నీ వదలిపెట్టి, తొందర లేనివాడై, జీవుని స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకొని, ధైర్యం వహించి బంధనాలు లేనివాడై యోగ్యమైన వైరాగ్యంతో కూడిన చక్కని జ్ఞానాన్ని అలవరచుకోవాలి. మాయాకల్పితమైన ఈ లోకంలో దేహం మొదలైన వానిపై ఆసక్తి లేకుండా ఉండాలి” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1012

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...