Monday, 26 August 2019

కపిల దేవహూతి సంవాదం - 99


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1010-క.
హరిమాయా విరచితమై
తరుణీరూపంబుఁ దాల్చి ధరఁ బర్విన బం
ధుర తృణపరివృత కూపము
కరణి నదియు మృత్యురూపకం బగు మఱియున్.
3-1011-చ.
ధన పశు మిత్ర పుత్ర వనితా గృహకారణభూత మైన యీ
తనువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తి తా
ననుగతమైన కర్మఫల మందకపోవఁగరాదు మింటఁ బో
యిన భువిఁ దూరినన్ దిశల కేగిన నెచ్చట నైన డాగిఁనన్.

భావము:
నా మాయచేత కల్పించబడిన కామినీరూపం దట్టమైన గడ్డిచే కప్పబడిన కూపానికి అనురూపమై, మృత్యుస్వరూపమై ఉంటుంది. ఇంకా ధన్యధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1011

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...