Monday, 27 January 2020

దక్ష యాగము - 17


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-69-సీ.
"కల్యాణి నీ మాట గడు నొప్పు; బంధువుల్;
పిలువకుండినను సంప్రీతిఁ జనుదు
రంటి; విదియు లెస్స యైనను దేహాభి;
మాన మదము ననమర్షమునను
గడఁగి యారోపిత ఘన కోపదృష్టులు;
గారేనిఁ బోఁదగుఁ గాని వినుము
వినుత విద్యా తపోవిత్త వయో రూప;
కులములు సుజనులకును గుణంబు;
4-69.1-తే.
లివియ కుజనులయెడ దోషహేతుకంబు
లై వివేకంబు చెఱుచు; మహాత్ములైన
వారి మాహాత్మ్యమాత్మ గర్వమునఁ జేసి
జడులు పొడగానఁ జాలరు జలజనేత్ర!
4-70-క.
విను; మట్టి కుటిలు లగు దు
ర్జనుల గృహంబులకు బంధుసరణిని బోవం
జనదు; వినీతుల కది గడు
ననుచిత మైనట్ల యుండు; నది యెట్లనినన్.


భావము:
“దేవీ! నీ మాటలు ఎంతో యుక్తంగా ఉన్నాయి. బంధువులు పిలువకపోయినా ప్రాజ్ఞులైనవారు ప్రీతితో వెళ్తారని నీవు చెప్పింది కూడా బాగుంది. దేహాభిమానం వల్ల కలిగిన మందం చేతనూ, ఆగ్రహావేశం చేతనూ వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కాని నీ తండ్రి సరసుడు కాడు. విను. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం అనేవి మంచివారికి సుగుణాలే కాని చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోషకారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మాక్షీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరు. సతీ! విను. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని. అది ఎలాగంటే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=70

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...