Tuesday, 28 January 2020

దక్ష యాగము - 18


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-71-ఆ.
కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు
నార్యు లేగ, వా రనాదరమున
బొమలు ముడిపడంగ భూరి రోషాక్షులై
చూతు; రదియుఁ గాక సుదతి! వినుము.
4-72-చ.
సమద రిపుప్రయుక్త పటుసాయక జర్జరితాంగుఁ డయ్యు దుః
ఖమును దొఱంగి నిద్రఁగనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో!
యుమ! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాఁటఁ జి
త్తమున నహర్నిశంబుఁ బరితాపము నొంది కృశించు నెప్పుడున్.
4-73-క.
విను లోకోత్కృష్టుఁడు ద
క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుతవై
నను నా సంబంధంబున
జనకునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ!


భావము:
కుటిల స్వభావం కల దుర్జనుల గృహాలకు సుజనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ దుష్టులు కనుబొమలు చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరిమి ఉరిమి చూస్తారు. సతీ! అంతేకాదు, విను. బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాలచేత శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి వ్యక్తి ఎలాగో నిద్రపోతాడు కాని క్రుంగి కృశించిపోడు. సతీ! దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలు గుండెల్లో లోతుగా నాటుకొని మాటిమాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృశింపజేస్తాయి. తరుణీ! విను. లోకాలన్నిటికీ గొప్పవాడైన దక్షునికి తన కుమార్తె లందరిలోనూ నీవు మిక్కిలి ప్రియమైన కూతురువైనా నా సంబంధం వల్ల నీ తండ్రి నిన్ను గౌరవించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=73

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...