Tuesday, 28 January 2020

దక్ష యాగము - 19


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-74-వ.
అది యెట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజఁబడయమికి నతనికి నీకు విరోధంబునకు హేతు వెట్టి దని యంటివేని.
4-75-మ.
నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల సత్కీర్తిఁ గొం
దఱు కామించి యశక్తులై మనములన్ దందహ్యమానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముం డీశ్వరుం డైన యా
హరితో బద్ద విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.
4-76-వ.
అదియునుం గాక, నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు; రదియ ప్రాజ్ఞ లయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయుక్తం బని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురు; గాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు; కాన యేనును వాసుదేవ శబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతఃకరణంబు నందు నావరణ విరహింతుడు నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించుచుండుదు; ఇట్ల నపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబు నందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డైన నతఁడును దదనువర్తు లయిన వారలును జూడఁ దగరు; కావున మద్వచనాతిక్రమంబునం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ బడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే;” యని పలికి మఱియు నభవుండు, పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభం బగు ననియు; నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; అంత.


భావము:
అది ఎలా? నీ సంబంధం చేత నాకు గౌరవం లభించక పోవడానికి, నీకూ అతనికి విరోధం కలగడానికి కారణమేమిటి?’ అని నీవు అడిగితే అహంకారం, పాపం లేని సజ్జనులు పొందే కీర్తిని తాముకూడా పొందాలని కోరుకొని కొందరు అసమర్థులై మనసులో కుతకుత ఉడికిపోయి, భగవంతుడైన హరితో వైరం పెంచుకొన్న రాక్షసులవలె ఆ సజ్జనులపై అసూయ పెంచుకుంటారు. అంతే కాక ‘నీవు ఆయనను చూచి లేచి ఎదురు వెళ్ళలేదు. అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు’ అని నీవు అనవచ్చు. లోకంలో సామాన్యజనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ప్రాజ్ఞులైనవారు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని ఆయనను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారం మొదలైనవి చేస్తారు. అంతేకాని, దేహాభిమానం కల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను భగవంతుడు, కేవల సత్త్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తూ ఉంటాను. ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించాడు. అందువల్ల దక్షుడు నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు చూడదగనివారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరిగి తీరుతుంది. లోకంలో బంధువులచేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా!” అని చెప్పి శంకరుడు సతీదేవిని పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డుపడితే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుందని తన మనస్సులో భావించి, ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=76

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...