Thursday, 30 January 2020

దక్ష యాగము - 20


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-77-సీ.
సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః;
ఖస్వాంత యగుచు నంగములు వడఁక
నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు;
గండభాగంబులఁ గడలుకొనఁగ
నున్నత స్తనమండలోపరిహారముల్;
వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
నతిశోకరో షాకులాత్యంత దోదూయ;
మానమై హృదయంబు మలఁగుచుండ
4-77.1-తే.
మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు
నాత్మదేహంబు సగ మిచ్చి నట్టి భవుని
విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె
జనకుఁ జూచెడు వేడుక సందడింప.
4-78-వ.
ఇట్లతి శీఘ్రగమనంబున.
4-79-సీ.
మానిని చనుచుండ మణిమన్మదాది స;
హస్ర సంఖ్యాత రుద్రానుచరులు
యక్షులు నిర్భయులై వృషభేంద్రుని;
మున్నిడు కొనుచు నమ్ముదిత దాల్చు
కందుకాంబుజ శారికా తాళవృంత ద;
ర్పణ ధవళాతపత్రప్రసూన
మాలికా సౌవర్ణమణివిభూషణ ఘన;
సార కస్తూరికా చందనాది
4-79.1-తే.
వస్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి
శంఖ దుందుభి వేణు నిస్వనము లొప్ప
మానితంబైన వృషభేంద్రయానఁ జేసి
యజ్ఞభూమార్గులై యర్థి నరిగియరిగి.
4-80-వ.
ముందట.


భావము:
తన బంధువులను చూడాలనే కుతూహలం సఫలం కాకపోవడం వల్ల సతీదేవి మనస్సులో దుఃఖం పొంగి పొరలింది. అవయవాలు కంపించాయి. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జాలువారాయి. వక్షస్థలం మీది హారాలు నిట్టూర్పుల వేడికి కందిపోయాయి. శోకంతో కోపాతిరేకంతో సతీదేవి మనస్సు చలించి కలత చెందింది. ఆ కోపంలో ఆమె వివేకం కోల్పోయింది. తనతో సరిసమానుడు లేని స్వామిని, తన శరీరంలో సగమిచ్చిన తన స్వామిని, పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి తండ్రిని చూడాలనే కుతూహలం అతిశయించగా ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది. ఈ విధంగా మిక్కిలి వేగముగా ప్రయాణం చేసి...
సతీదేవి వెళ్తుండగా మణిమంతుడు మొదలైన వేలకొలది ప్రమథులు, యక్షులు నందీశ్వరుని ముందు పెట్టుకొని బయలుదేరారు. ఆమెకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు, నగారాలు, పిల్లనగ్రోవులు మ్రోగిస్తూ యజ్ఞం జరిగే ప్రదేశంవైపు ప్రయాణం చేసి ఎదురుగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=79

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...