Sunday, 2 February 2020

దక్ష యాగము - 24


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-90-చ.
నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ దిరస్కరించు న
క్కలుషుని జిహ్వఁ గోయఁ దగుఁ; గా కటు చేయఁగ నోపఁడేని దాఁ
బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్
బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు ధర్మవర్తనుల్.
4-91-వ.
అది గావున.
4-92-మ.
జనుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైన యన్నంబు స
య్యన వెళ్ళించి పవిత్రుఁడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్
ఘను నిందించిన నీ తనూభవ యనం గా నోర్వ, నీ హేయ భా
జన మైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధిఁ బాటిల్లెదన్.
4-93-వ.
అదియునుం గాక, దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతల గమనంబును, స్వాభావికంబు లయినట్లు ప్రవృత్తినివృత్తి లక్షణ కర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి రాగయుక్తులై కర్మతంత్రు లయిన సంసారులకు వైరాగ్యయుక్తు లయి యాత్మారాము లయిన యోగిజనులకు విధినిషేధరూపంబు లయిన వైదిక కర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటం జేసి స్వధర్మ నిష్ఠుండగువాని నిందింపం జనదు; ఆ యుభయకర్మ శూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిఁ గ్రిఁయా శూన్యుం డని నిందించుట పాపం బగు; దండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగిజన సేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబు లగు నైశ్వర్యంబులు ధూమమార్గ ప్రవృత్తులై యాగాన్నభోక్తలైన వారి చేత యజ్ఞశాలయందె చాల నుతింపంబడి యుండుఁ గాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుఁ, జితాభస్మాస్థి ధారణుండైన రుద్రుండు దరిద్రుం డనియును గర్వింపం జన” దని; వెండియు నిట్లనియె.


భావము:
ధర్మపాలన చేత పవిత్రుడైన శివుణ్ణి తిరస్కరించే పాపాత్ముని నాలుక కోసివేయాలి. అలా చేయలేనప్పుడు చావడం మంచిది. రెండూ చేతకాని పక్షంలో చెవులను మూసికొని అక్కడినుండి వెళ్ళిపోవడం న్యాయమని ధర్మజ్ఞులు చెప్తారు.అందువల్ల తెలియక తిన్న దుష్టాన్నాన్ని మానవుడు కక్కి పవిత్రుడైనట్లు దుష్టుడవై ఈవిధంగా గొప్పవాడైన ఈశ్వరుని నిందించిన నీకు కుమార్తెను అనిపించుకొనడం నాకు ఇష్టం లేదు. నీవల్ల ప్రాప్తమైన ఈ పాడు శరీరాన్ని విడిచి పవిత్రురాలను అవుతాను. అంతేకాక దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు, విధి నిషేధ లక్షణాలు కలిగిన కర్మలు రాగ వైరాగ్యాలకు కారణాలుగా వేదాలు విధించడం వలన రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకూ, వైరాగ్యంతో కూడి ఆత్మారాములైన యోగులకు విధి నిషేధ రూపాలలో ఉన్న వైదికకర్మలు కలిగిఉండడమూ లేకపోవడమూ సహజం. అందువల్ల స్వధర్మపరుడైనవానిని నిందించరాదు. (సంసారులకు అగ్నిహోత్రాలు మొదలైన ప్రవృత్తి కర్మలను, విరక్తులకు శమదమాది నివృత్తి కర్మలను వేదాలు విధించాయి. దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు సంసారులకు, విరక్తులకు వేరువేరు ధర్మాలు సహజాలు. విధి నిషేధ రూపాలైన వైదిక కర్మలు ధర్మాసక్తులైన సంసారులకే కాని ఆత్మారాములైన యోగులకు కాదు.) ప్రవృత్తి నివృత్తి కర్మలు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన సదాశివుని నిందించడం పాపం. తండ్రీ! సంకల్పమాత్రం చేతనే మేము పొందగలవీ, యోగిజనులచేత సేవింపబడేవీ అయిన అణిమ మొదలైన అష్టసిద్ధులను నీవు పొందలేవు. నీ ఐశ్వర్యాలను యజ్ఞశాలలో హోమధూపాల మధ్య తిరుగుతూ, యజ్ఞాన్నాన్ని భుజించేవారు ఇక్కడ మాత్రమే స్తుతిస్తారు. కనుకనీవు మిక్కిలి సంపన్నుడవనీ, చితాభస్మాన్నీ ఎముకలను ధరించే రుద్రుడు దరిద్రుడనీ భావించి గర్వించకు” అని చెప్పి ఇంకా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=93

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...