Monday, 3 February 2020

దక్ష యాగము - 25


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-94-ఉ.
"నీలగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా?
చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నేల ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్.
4-95-చ.
వర వృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా
దరపరిహాస వాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ
బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచఃస్మితంబులం
దొఱఁగుదు; నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్."
4-96-వ.
అని యిట్లు యజ్ఞసభా మధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని యగు సతీదేవి యుదఙ్ముఖి యయి జలంబుల నాచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయై భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు చేయం దలంచి.


భావము:
"తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమానవ! ఇక చాల్లే! నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా? పూడ్చడానికా? వృషభధ్వజుడు, భగవంతుడు అయిన శివుడు నన్ను ఆదరంగానో పరిహాసంగానో ‘దక్షతనయా’ అని పిలిచినప్పుడు నేను మిక్కిలి దుఃఖిస్తూ ఆనందాన్ని పొందలేక చమత్కారపు మాటలతోనో, చిరునవ్వుతోనో తొలగిపోతాను. నీ కుమార్తెను అని బాధపడడం కంటె చావడం మేలు. అని ఈ విధంగా యజ్ఞమండప మధ్యభాగంలో తమకు వ్యతిరేకి అయిన దక్షునితో పలికి, కామక్రోధాదులైన అంతశ్శత్రువులను నాశనం చేసే సతీదేవి తూర్పుదిక్కుకు తిరిగి, జలాలతో ఆచమనం చేసి, శుచియై, మౌనం పూని, నేలపై కూర్చొని యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొన్నదై...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=96

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...