(దక్షాధ్వర ధ్వంసము )
4-105-శా.
ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్
విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చంచజ్జటన్
సద్యః క్రోధముతోడఁ బుచ్చివయిచెన్ క్ష్మాచక్ర మధ్యంబునన్.
4-106-వ.
ఇట్లు పెఱికి వైచిన రుద్రుని జట యందు.
4-107-సీ.
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ;
కృన్నీలదీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల;
జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ;
సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక;
వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను
4-107.1-తే.
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
భావము:
ఆదిదేవుడు, ఉగ్ర రూపుడు, నీలగ్రీవుడు, గజాసుర సంహారి అయిన శివుడు పెదవి కరచుకొని, మదించిన సింహంవలె గర్జించి, భయంకరంగా నవ్వుతూ మెరుపువలె అగ్నిజ్వాల వలె ప్రకాశించే జటను మహాకోపంతో పెరికి భూమిపైన విసరికొట్టాడు. ఈ విధంగా పెరికివేసిన శివుని జట నుండి సకల లోకాలకూ భయం కలిగించే రెండవ రుద్రుని వలె వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతూ కాలమేఘ మేమో అనే భ్రాంతి కలిగిస్తున్నది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వంటి వెయ్యి బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన మూడు కన్నులు చండప్రచండ మార్తాండుల వంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరి చూడరాకుండా ఉన్నాడు. మెడనిండా కపాలమాలలు వ్రేలాడుతుండగా. వంకర్లు తిరిగి రంపాల్లా కరకు దేలిన కోరలుతో మిక్కలి భయంకరంగా ఉన్నాడు. దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్ని యందు దగ్ధమయింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరి కొట్టాడు. ఆ మహారుద్రుని జట నుంచి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసార్థమై ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం వృత్తౌచిత్యం భావౌచిత్యం శబ్దాడంబరం అర్థగాంభీర్యాలతో అలవోకగా అలరించే మన సహజకవి ఈ పోతనామాత్యల సీసపద్యం వీరభద్రుని బహుదీర్ఘదేహాన్ని సూచిస్తున్న మణిరత్మం.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=107
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment