(దక్షాధ్వర ధ్వంసము )
4-108-తే.
వీరభద్రుండు విహత విద్వేషి భద్రుఁ
డగుచుఁ దన వేయి చేతులు మొగిచి వినయ
మెసఁగ "నే నేమి సేయుదు? నెఱుఁగ నాకు
నానతి" మ్మన్న నతని కయ్యభవుఁ డనియె.
4-109-చ.
"గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్
బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే
నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్?"
4-110-వ.
అని కుపిత చిత్తుండై యాజ్ఞాపించిన "నట్లకాక" యని.
4-111-చ.
అనఘుఁడు రుద్రుఁ జేరి ముదమారఁ బ్రదక్షిణ మాచరించి వీ
డ్కొని యనివార్య వేగమునఁ గుంభిని గ్రక్కదలన్ ఝళంఝళ
ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయఁగ భీషణప్రభల్
దనరఁ గృతాంత కాంతకశితస్ఫుట శూలముఁ బూని చెచ్చెరన్.
భావము:
వీరభద్రుడు శత్రు సంహారాన్ని తలపెట్టినవాడై తన వేయి చేతులు మోడ్చి వినయంతో “నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి” అని అడిగాడు. అప్పు డతనితో శివుడు ఇలా అన్నాడు. “యుద్ధవిద్యా విశారదుడవైన భుజపరాక్రమశాలీ! నా ప్రమథగణాల కంతటికీ నీవు సేనానివై వెంటనే వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని సంహరించు. బ్రాహ్మణతేజం అజేయమని సందేహించకు. నా అంశతో జన్మించిన నీకు అసాధ్య మెక్కడిది?” అని కోపంతో ఆజ్ఞాపించగా అలాగే అని పుణ్యాత్ముడైన వీరభద్రుడు శివుని సమీపించి ప్రదక్షిణం చేసి అతని సెలవు తీసుకొని అడ్డులేని మహావేగంతో భూమి అదిరిపోతుండగా, పాదాలకు తొడిగిన మణులు తాపిన అందెలు ఝళంఝళమంటూ మ్రోగుతుండగా, యముణ్ణి సైతం అంతం చేయగల్గిన వాడిశూలాన్ని ధరించి వెంటనే...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=111
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment