Friday 10 September 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౪(334)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-687-వ.
ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబుచేసి రోమాంచకంచుకిత శరీరుండై యానందబాష్పధారాసిక్తకపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుఁడు విప్ర వృద్ధజనంబులకు నమస్కారంబులుచేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుం డై కేకయ సృంజ యాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల కనేక పదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుండై వివిధ మణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టియెడ.

భావము:
ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. గట్టిగా కౌగలించుకుని పులకితశరీరుడై, ఆనందబాష్పాలు చెక్కిళ్ళను తడుపుతుండగా, ఆనందపారవశ్యంతో ధర్మజుడు ప్రపంచాన్ని మరచిపోయీడు. వాయుసుత, ఇంద్రసుతులైన భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకుని ఆనందించారు. మాద్రి పుత్రులు ఐన నకులసహదేవులు నళిననాభునికి నమస్కారం చేసారు. అటుపిమ్మట, శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకూ వందనం చేసి, వారు చేసిన పూజలకు సంతోషించాడు. కేకయ సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమతులు ఇచ్చాడు. అనంతరం చతురంగబలసమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి ప్రవేశించాడు. అలా పరమ వైభవంగా రాజమార్గము వెంట వెళుతున్న శ్రీకృష్ణుడిని నగరకాంతలు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=687 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...