Saturday 11 September 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౫(335)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-688-సీ.
కొఱనెలపైఁ దోచు నిరులు నాఁ జెలువొంది-
  నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ
హాటకమణిమయ తాటంకరోచులు-
  గండభాగంబుల గంతులిడఁగ
స్ఫురిత విద్రుమనిభాధరబింబరుచితోడ-
  దరహాసచంద్రిక సరసమాడ
నొండొంటితో రాయు నుత్తంగ కుచకుంభ-
  ములు మొగంబులకును బుటము లెగయ
10.2-688.1-తే.
బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ
రవళిమట్టెలు మణినూపురములు మొరయఁ
బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ
బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ.
10.2-689-వ.
ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురు పతి సుత బంధు జనంబులు వారింప నతిక్రమించి సమున్నత భర్మహర్మ్య శిఖాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. 

భావము:
అలా పురుషోత్తముడిని దర్శించడానికి పురస్త్రీలు మేడలపై గుమికూడారు. అర్థచంద్రునిమీద మబ్బులు క్రమ్ముకొన్నాయా అన్నట్లు నెన్నుదుటిమీద ముంగురులు మూగుతున్నాయి; బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళ మీద గంతులు వేస్తున్నాయి; పగడపుకాంతిని తిరస్కరించే దొండపండు అధరాల కాంతులు, చిరునవ్వులు వెన్నెలలతో సరసమాడుతున్నాయి; ఒకదానికొకటి ఒరుసుకుంటున్న ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో ఉబుకుతున్నాయి; సన్నని నడుములు వణుకుతున్నాయి నడచేటప్పుడు మెట్టెలూ అందెలూ గల్లుగల్లున మ్రోగుతున్నాయి; జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యంచేస్తున్నాయి; పైటలు జారిపోతున్నాయి. ఇలా మనోహరంగా బయలుదేరి, పౌరకాంతలు కృష్ణుడిని దర్శించాలనే కుతూహలంతో, ఒకరి నొకరు పిలుచుకుంటూ, పెద్దలూ ఇంటివారూ వద్దంటున్నా వినకుండా, ఎత్తైన మేడలు ఎక్కి, ముకుందుని దర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=688 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...